Begin typing your search above and press return to search.

వైసీపీలో చేరతారనే ప్రచారంపై వర్మ ఘాటు రియాక్షన్!

అవును... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.

By:  Tupaki Desk   |   29 April 2024 7:54 AM GMT
వైసీపీలో చేరతారనే ప్రచారంపై వర్మ ఘాటు రియాక్షన్!
X

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రోహిణీకార్తి ఎండలను గుర్తుకుతెస్తున్నాయి! ప్రధానం కొన్ని కీలక నియోజకవర్గాల్లో నేతల మధ్య మాటల తూటాలు మరింతగా హోరెత్తిపోతున్నాయి. నువ్వు ఒకటంటే.. నేను పదంటాను అన్నట్లుగా విమర్శలూ ప్రతివిమర్శలూ సాగుతున్నాయి. ఇక పిఠాపురం సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా వర్మ ఎంటరై.. వాటికి మరింత మసాలా యాడ్ చేశారు.

అవును... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఈ నియోజకవర్గంలో ఏమి జరుగుతుందనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారన్నా అతిశయోక్తి కాదన్నట్లుగా ఉంది పరిస్థితి! ఈ సమయంలో... తనకు టిక్కెట్ దక్కలేదనే అక్కసుతో వర్మ ఉన్నారని.. ఆయన ఇవాళో రేపో వైసీపీలో చేరే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఒక చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది!

పిఠాపురంలో ఒక్కసారి పవన్ ని గెలవనిస్తే... ఇక తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని.. ఇక పవన్ ఉన్నంత కాలం ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ, దీన్ని సొంత నియోజకవర్గం చేసుకునే అవకాశం ఉందని.. అదే జరిగితే ఇక తన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడినట్లేనని వర్మ భావిస్తున్నారని ఒక ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ ఈ ప్రచారంపై ఘాటుగా స్పందించారు.

ఇందులో భాగంగా... తాను చంద్రబాబు మనిషిని అని చెప్పిన వర్మ.. నాలుగు నెలల క్రితం తనకు పవన్ కల్యాణ్ పరిచయం లేదని.. అయినా కూడా పిఠాపురంలో ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తానని చెప్పానని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు పవన్ కల్యాణ్ ని గెలిపించాలని నిజాయితీగా, కసిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... సుమారు వారం రోజుల నుంచి తాను వైసీపీలో చేరుతున్నట్లు ఒక వర్గం మీడియాలో ప్రచారం జరుగుతుందని వర్మ వెల్లడించారు.

ఈ సందర్భంగా... తాను చంద్రబాబు మనిషిని అని, తన గురించి వైసీపీ నేతలు 2014 నుంచీ ప్రయత్నిస్తున్నారని చెప్పిన వర్మ.. వారి వల్ల ఏమీ కాదని అన్నారు. ఇదే సమయంలో... పిఠాపురంలో ఓడిపోతామని తెలిసే వైసీపీ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఇదే క్రమంలో... ఎన్నికలయ్యాక చంద్రబాబు, పవన్ ల సమక్షంలో జగనే తమ పార్టీలో చేరతారని వర్మ చెప్పుకొచ్చారు.