Begin typing your search above and press return to search.

చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు

అవును... ఎన్నికల ప్రచార సభల్లోని తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

By:  Tupaki Desk   |   24 April 2024 5:30 AM GMT
చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు
X

పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలవ్వడంతో పాటు నామినేషన్ల పర్వానికి తుది గడువు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధాలు ఒక్కోసారి తీవ్రస్థాయిలో తారాస్థాయికి చేరుకుంటుండగా.. మరికొన్ని సందర్భాల్లో శృతిమించుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో నేతలు మరీ దిగజారిపోయి విమర్శలు చేస్తున్నారనే మాటలూ తెరపైకి వస్తున్నాయి.

ఈ విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలు ఏమీ లేవు.. అన్ని పార్టీల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేసేవారు లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల ఈసీవోకు వైసీపీ ఫిర్యాదులు చేసింది. దీంతో... వీటిపై చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయి!

అవును... ఎన్నికల ప్రచార సభల్లోని తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో... చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసి ఫిర్యాదుతోపాటు ఆధారాలు సమర్పించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై వరుసగా 18 ఫిర్యాదులు చేశారని తెలుస్తుంది.

ఇలా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులు, వాటికి సంబంధించిన ఆధారలకు సంబంధించిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ సమయంలో... తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నట్లుగా చంద్రబాబు వివరణతో కూడిన సమాధానాలు ఇవ్వగా.. మరికొన్నింటిపై చంద్రబాబు స్పందించలేదని అంటున్నారు.

ఇదే సమయంలో వీడియో క్లిప్పింగులు ఉన్నప్పటికీ చంద్రబాబు నుంచి వచ్చిన సమాధానాలపై సీఈవో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరతూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో మీనా లేఖ రాసారు! కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో వీడియోలను జత చేసినట్లు తెలిపారు!

మరోపక్క జగన్ పైనా టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. ఇందులో భాగంగా... చంద్రబాబు, పవన్ పైన చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెబుతున్నారు. దీని పైన సీఈవో నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీఎం జగన్, చంద్రబాబులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది!