Begin typing your search above and press return to search.

మోహ‌న్ బాబును కాపాడింది వారేన‌ట‌

By:  Tupaki Desk   |   5 Oct 2017 7:51 AM GMT
మోహ‌న్ బాబును కాపాడింది వారేన‌ట‌
X
ప‌క్కింటి మీద ప్రేమ ఉండ‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఆ ప్రేమ సొంతింటి వాళ్ల‌ను చిన్న‌బుచ్చేలా ఉండ‌కూడ‌దు. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు మాట‌లు ఇందుకు భిన్నంగా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్ బాబుకు ఆశ్ర‌యం ఇచ్చి.. అవ‌కాశాలిచ్చి.. ఆయ‌నకు త‌న‌ను తాను నిరూపించుకునే అవ‌కాశం ఇచ్చింది మ‌ద్రాసు మ‌హాన‌గ‌ర‌మేన‌ని చెప్పాలి. అయితే.. తెలుగోళ్ల‌ను చిన్న‌బుచ్చేలా ఆయ‌న మాట‌లు ఉండ‌టమే ఇప్పుడు ప్ర‌శ్న‌.

డాక్ట‌ర్ ఎంజీఆర్ వ‌ర్సిటీ 26వ స్నాత‌కోత్స‌వంలో త‌మిళ‌నాడు రాష్ట్ర ఇన్ ఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు చేతుల మీదుగా మోహ‌న్ బాబుకు గౌర‌వ డాక్ట‌రేట్‌ ను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న మాట‌ల‌తో త‌మిళుల మ‌న‌సుల్ని దోచుకున్నారు మోహ‌న్ బాబు. త‌న‌కు త‌మిళ‌నాడు పుట్టిల్లు లాంటిద‌ని చెప్పుకున్నారు.

త‌మిళ‌నాడులో అడుగుపెడితే త‌న పుట్టింటికి వ‌చ్చిన అనుభూతి క‌లుగుతుంద‌న్నారు. త‌మిళ‌నాడు త‌న జ‌న్మ‌భూమిగా ఆయ‌న వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. భావోద్వేగానికి గురైన ఆయ‌న త‌న‌ప్ర‌సంగంలో భాగంగా ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు.

త‌న ప్ర‌సంగాన్ని త‌మిళంలో చేసి స‌భికుల్ని ఆక‌ట్టుకున్నారు. చెన్నైలోని వైఎంసీఏలో డ్రిల్ మాస్ట‌ర్ గా.. టీ న‌గ‌ర్ లో కేస‌రి స్కూల్ టీచ‌ర్‌ గా ప‌ని చేసిన నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సినిమా ఛాన్సుల కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డ్డాన‌ని.. అలాంటి క‌ష్ట‌కాలంలో త‌న‌ను ఆదుకున్న‌ది త‌మిళులేన‌న్నారు. త‌న గురువు దాస‌రి నారాయ‌ణ‌రావు ద్వారా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాన‌ని.. ఆయ‌నే త‌న‌కు అప్ప‌టివ‌ర‌కూ ఉన్న భ‌క్త‌వ‌త్స‌లం పేరు స్థానే మోహ‌న్ బాబుగా మార్చార‌న్నారు.

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు విల‌న్ గా ప‌రిచ‌యం చేసింది త‌మిళ మ‌హాన‌టుడు న‌డిగ‌ర్ తిల‌కం శివాజీగ‌ణేశ‌న్ అని.. ఆయ‌న త‌న సొంత బ్యాన‌ర్ లో న‌టించే అవ‌కాశం ఇచ్చార‌న్నారు. శివాజీ అండ‌దండ‌ల‌తోనే తాను మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నార‌న్నారు.

ఆ గోల్డెన్ డేస్‌ను గుర్తు చేసుకుంటే తాను భావోద్వేగానికి గురి అవుతాన‌ని.. త‌న అభిమాన న‌టుడు ఎంజీఆర్ పేరుతో ఉన్న వ‌ర్సిటీ నుంచి త‌న చిర‌కాల మిత్రుడైన త‌మిళ‌నాడు ఇన్ చార్జ్ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు చేతుల మీదుగా డాక్ట‌రేట్ తీసుకోవ‌టం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అంతా బాగానే ఉంది కానీ.. క‌ష్ట‌కాలంలో ఆశ్ర‌యం ఇచ్చింది మ‌ద్రాసు మ‌హాన‌గ‌ర‌మే అయినా.. అవ‌కాశం ఇచ్చి అక్కున చేర్చుకొన్న తెలుగునేల‌ను ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం తెలుగోళ్లు నొచ్చుకునే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. మోహ‌న్ బాబుకు డాక్ట‌రేట్ ను ప్ర‌దానం చేసిన విద్యాసాగ‌ర్ రావు సైతం విల‌క్ష‌ణ న‌టుడి మాట‌ల చాతుర్యాన్ని చెప్పుకొచ్చారు.