Begin typing your search above and press return to search.

అమెరికా కి వెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అమెరికాలో ఇటీవల భారతీయులపై వరుసగా దాడులు చోటు చే సుకుంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 March 2024 9:30 AM GMT
అమెరికా కి వెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
X

అమెరికాలో ఇటీవల భారతీయులపై వరుసగా దాడులు చోటు చే సుకుంటున్న సంగతి తెలిసిందే. అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులపై వరుస దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. జాతి వివక్షో, మరో కారణమో కానీ భారతీయులే లక్ష్యంగా పేట్రేగిపోతున్నారు. అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న భారతీయుల మరణాలు, భారతీయులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రమాదాల్లో మరణిస్తున్నవారితోపాటు ఇటీవల కాలంలో హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

గత నెలలో భారతీయ కుటుంబం హత్యకు గురయింది. ఇటీవల ఒక భారతీయ సంగీతకారుడిని కాల్చిచంపారు. అలాగే ఒక విద్యార్థిని ఆశ్రయం ఇవ్వనందుకు ఒక దేశదిమ్మరి దారుణంగా కొట్టి హత్య చేశాడు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌ నాథ్‌ ఘోష్‌ ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. పది రోజుల క్రితం పిట్టల వెంకట రమణ అనే విద్యార్థి ఒక ప్రమాదంలో కన్నుమూయడం అందరిలో విషాదాన్ని నింపింది.

ఇలా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల వరుస మరణాలను మరిచిపోకముందే వారం క్రితం మరో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్‌ ను అతడు చదువుతున్న బోస్టన్‌ యూనివర్సిటీలోనే కాల్పి చంపారు.

ఇలా అమెరికాలో వెలుగుచూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలపై పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన 10 నిమిషాల వీడియోను న్యూయార్క్‌ లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది.

ఆ వీడియో ఇంద్రానూయి మాట్లాడుతూ ఇటీవల కొందరు భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి తాను విన్నానని, అందుకే ఈ వీడియో రికార్డు చేశానని వెల్లడించారు.

విద్యార్థులు అమెరికాలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్థానిక చట్టాలను గౌరవించాలని సూచించారు. అమెరికా చట్టాలను అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి తెలుసుకోవాలన్నారు. రాత్రివేళ చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం, మాదకద్రవ్యాలకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని ఇంద్రానూయి హితబోధ చేశారు.

భారతీయ విద్యార్థులు అమెరికాకు వచ్చిన కొత్తలో స్థానిక విద్యాసంస్థల పట్ల అవగాహనతో, సామాజిక మాధ్యమాల మోసాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఇంద్రానూయీ విద్యార్థులను కోరారు.

అలాగే స్నేహితుల ఎంపిక, కొత్త అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసా నిబంధనలు, తాత్కాలిక ఉద్యోగాలకు అనుమతులు, విదేశీ విద్యార్థులుగా మన పరిమితులు తెలిసి ఉండాలన్నారు.

భారతీయ విద్యార్థులు కఠోరశ్రమ, విజయానికి చిరునామా అని ఇంద్రానూయి కొనియాడారు. కొందరు ఫెంటానిల్‌ వంటి డ్రగ్స్‌ కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అవి ప్రాణాంతకమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్‌ మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు కెరీర్‌ అవకాశాలను దెబ్బతీస్తాయన్నారు.