Begin typing your search above and press return to search.

50వేల ఏళ్ల క్రితం మానవులు.. వాళ్ల జోలికెళ్తే..

By:  Tupaki Desk   |   23 Nov 2018 9:10 AM GMT
50వేల ఏళ్ల క్రితం మానవులు.. వాళ్ల జోలికెళ్తే..
X
మనిషి చంద్రమండలం దాటి అంగారకుడిపైకి అన్వేషణ మొదలుపెట్టాడు. కానీ ఆ ఆ ఆదిమ మానవ జాతి ఇంకా బట్టల్లేకుండా అడవిలోనే తిరుగుతున్నారు.. అణుబాంబులు - యుద్ధ విమానాలు - అత్యాధునిక క్షిపణులు తయారు చేస్తూ మనిషి యుద్ధ తంత్రంలో ముందుకెళుతుంటే.. ఇంకా ఆ ఆదిమ తెగ బాణాలతో తిరుగుతూ బతుకీడుస్తోంది. ఆధునిక మానవుని జాడనే సహించడం లేదు. సాహసం చేసి వచ్చిన వారిని బాణాలతో చంపేస్తున్నారు. 50 వేల ఏళ్ల క్రితం మనిషి ఎలా ఉన్నాడో అలానే ఉంటూ ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తున్నారు. భారత్ లోని అండమాన్ దీవుల సమీపంలో ఉన్నఓ దీవిలో ‘సెంటినలీస్’ ఆదిమ మానవుడి తెగ వారు తాజాగా వారి దీవికి వచ్చిన ఓ అమెరికన్ ను చంపడంతో వీరి విషయం వెలుగులోకి వచ్చింది.

మా బతుకు మాది.. మా జోలికొస్తే దాడులు చేయడమే కాదు.. చంపడకైనా వెనుకాడబోం అంటున్నారు సెంటినలీస్ లు. ఇంతకీ వీరి గురించి ఎందుకు చెబుతున్నమంటే.. గత రెండురోజులుగా ఎక్కడా చూసిన వీరి గురించే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ సెంటినలీస్ లు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే..

సెంటినలీస్ లు మనలాగా డబ్బులు వాడరు. మన లాగా దుస్తులు వేసుకోరు. దుస్తుల స్థానంలో ఆకులు కట్టుకొని జీవిస్తారు. వీరిని దూరం నుంచి గమనించిన దాని ప్రకారం.. వీరికి పడవలు తయారు చేయడం వచ్చు. లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేపలు పడతారు. వీరు వారి దీవిలోకి ఎవరినీ రానివ్వరు. వెళ్లి తిరగొచ్చిన మానవుడు ఇంతవరకు లేడంటే ఆశ్చర్యపోక మానదు.

2004లో సునామీ వచ్చినపుడు వీరుంటున్న దీవి సర్వం కోల్పోయింది. వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా జారవిడిన ఆహారం కనీసం ముట్టుకోలేదు. కాగా అప్పట్లో దారితప్పి ఈ దీవిలో అడుగుపెట్టిన ఇద్దరు జాలర్లను తెగ వారు చంపేశారు. మన కోస్ట్ గార్డ్ కు చెందిన పడవలు నార్త్ సెంటినెల్ ద్వీపం వద్ద కాసేపు లంగరేసి నిలబడతాయి తప్ప లోపలికి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు..

సెంటీనలీస్ లను దారి తెచ్చుకునేందుకు ప్రభుత్వాలు - పలు సంస్థలు సామ - దాన దండోపాయలు ప్రయోగించినా వారు దేనికి లొంగడం లేదు. 1880లో బ్రిటిష్ మిలిటరీ సెంటినలీస్ పై దాడిచేసి వృద్ధ దంపతులు - నలుగురు సంతానాన్ని ఫొర్ట్ బ్లయిర్ కు తీసుకొచ్చింది. కొద్ది రోజులకే ఆ వృద్ధ దంపతులు చనిపోగా వారి సంతానాన్ని తిరిగి అడవుల్లోనే వదిలేశారు.

స్వాతంత్రం అనంతరం 1967లో టీ.ఎన్. పండిట్ అనే పురాతత్వ వేత్త సెంటినలీస్ లను సంప్రదించే ప్రయత్నం చేస్తే వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు ఉంచి ఎవరైనా తీసుకెళతారా అని పరిశీలించింది. కాగా వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు.

నేషనల్ జియోగాఫ్రిక్ చానల్ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీసేందుకు 1974లో ఆ దీవికి వెళ్లారు. కొబ్బరిబొండాలు - అల్యూమినియం పాత్రలు - ఓ పందిని బహుమతులుగా తీసుకెళ్లగా తీరంలో అడుగుపెట్టగానే వారిపై బాణాల వర్షం కురిపించారు. దీంతో వారు అక్కడి నుంచి పరుగు పెట్టారు. కాగా తెగ వారు కొబ్బరిబోండాలు - కొన్ని పాత్రలు తీసుకెళ్లారు గానీ ఆ పందిని మాత్రం చంపి పాతేసినట్టు సిబ్బంది తెలిపారు.

ఆ తరువాత 1991లో టీ.ఎన్. పండిట్ మరోసారి సంప్రదించి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులకు ఆసక్తిగా తడిమి చూశారు. ఆ తర్వాత సెంటినలీస్ లు అంటువ్యాధుల బారినపడటంతో భారత ప్రభుత్వం వారి గురించి తెలుసుకోవడానికి స్వస్తి పలికింది.

కాగా ఇటీవల అండమాన్ నికోబార్ లోని నార్త్ సెంటినల్ దీవిలో అమెరికా పర్యాటకుడు హత్యకు గురయ్యాడు. మత బోధకుడిగా పనిచేస్తున్న అలెన్ తన మతం గురించి సెంటినలీస్ కు వివరించేందుకు ఒక పడవను అద్దెకు తీసుకొని కొందరు జాలర్లతో అక్కడి వెళ్లాడు. వాళ్లు బాణాలతో దాడులు చేయడంతో అతను చనిపోయినట్లు అండమాన్ షీఖా అనే పత్రిక వెల్లడించింది. మరోవైపు అమెరికా కాన్సులేట్ అలెన్ కనిపించడం లేదని మాత్రమే ప్రకటించింది.