Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎమ్మెల్యే నోట అలాంటి మాట‌లా..?

By:  Tupaki Desk   |   25 Nov 2017 4:09 AM GMT
జ‌గ‌న్ ఎమ్మెల్యే నోట అలాంటి మాట‌లా..?
X
రాజ‌కీయాల్లో ల‌క్ష్మ‌ణ రేఖ‌లు స్ప‌ష్టంగా ఉంటాయన్న విష‌యం తెలిసిందే. అలాంటి ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని అల‌వోక‌గా దాటేశారంటే అందులో ఏదో మ‌ర్మం ప‌క్కా. ఉత్తి పుణ్యానికే త‌మ రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థుల‌ను పొగిడే ప‌ని అస్స‌లు చేయ‌రు. అలా చేశారంటే దాని వెనుక ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండ‌కుండా ఉండ‌దు.

తాజాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్ర‌సాద్ రెడ్డి నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి. బాబు స‌ర్కారు చేప‌ట్టిన జీప్ల‌స్ త్రీ ఇళ్ల నిర్మాణంపై ఆయ‌న పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించేశారు. అన్నింటికి మించి తాను ప్రాతినిధ్యం వ‌హించే పార్టీకి దైవ‌స‌మాన‌మైన వైఎస్ తో బాబును పోల్చ‌ట‌మే కాదు.. దివంగ‌త మ‌హానేత‌ను చిన్న‌బుచ్చుతూ.. బాబును పొగిడేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

వైఎస్ స‌ర్కారులో నిర్మించిన ఇందిర‌మ్మ ఇళ్ల‌లో స‌దుపాయాలు లేవ‌ని వ్యాఖ్యానించిన సాయి ప్రసాద్ రెడ్డి.. స‌ద‌రు ఇళ్లు కూలిపోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. దివంగ‌త నేత పాల‌న‌ను త‌ప్పు ప‌ట్టేలా ఉన్న ఆయ‌న వ్యాఖ్య‌లు.. బాబు స‌ర్కారుపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసేలా మాట్లాడ‌టం విశేషం.

వైఎస్ హ‌యాంలో నిర్మించిన ఇందిర‌మ్మ ఇళ్ల కంటే.. ప్ర‌స్తుతం బాబు క‌ట్టిస్తున్న జీప్ల‌స్ ఇళ్ల నిర్మాణం చాలా బాగుందని వ్యాఖ్యానించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కిన నేప‌థ్యంలో.. సాయి ప్ర‌సాద్‌రెడ్డి సైతం అదే బాట‌లో ప‌య‌నిస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

త‌న మాట‌ల‌తో క‌న్ఫ్యూజ‌న్‌కు గురి చేస్తున్నారు సాయి ప్ర‌సాద్ రెడ్డి. గ‌తంలో తాను పార్టీ మారితే భారీ మొత్తంలో డ‌బ్బులు ముట్ట‌జెబుతామంటూ తెలుగు త‌మ్ముళ్లు భారీ ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లుగా మీడియాకు వెల్ల‌డించారు. తాను.. త‌న సోద‌రుడు నిప్పుల‌మ‌ని.. డ‌బ్బు ప్ర‌లోభాల‌కు లొంగే వ్య‌క్తులం కాద‌ని చెప్పుకున్నారు. న‌మ్మ‌కంతో గెలిపించిన ప్ర‌జ‌ల‌కు తాము విశ్వాసానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని వ్యాఖ్యానించారు. ఇంత నిప్పు అయితే..సొంత పార్టీని చిన్న‌బుచ్చేలా.. దివంగ‌త మ‌హానేత పాల‌న‌నే త‌ప్పు ప‌ట్టేలా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వైఎస్ జ‌మానాలో దివంగ‌త నేత‌కు వీర విధేయుడిగా ఉన్న సాయి.. ఇప్పుడు మాట్లాడుతున్న మాట‌లు ఎక్క‌డో తేడా కొట్టేసేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.