Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ!

By:  Tupaki Desk   |   5 Sep 2018 10:24 AM GMT
తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ!
X
మ‌రెక్క‌డా లేని రాజ‌కీయ చైత‌న్య‌మంతా తెలంగాణ‌లోనే ఉన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్నిచూస్తే.. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ‌లో ఉన్న‌న్ని రాజ‌కీయ పార్టీలు వేదిక‌లు ఏపీలో క‌నిపించ‌వు. బ‌ల‌హీన‌మైన ముఖ్య‌మంత్రి ఉన్న ఏపీలో ఎక్కువ రాజ‌కీయ పార్టీలు లేక‌పోవ‌టానికి కార‌ణం బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉండ‌ట‌మే.

అదే స‌మ‌యంలో బ‌ల‌మైన అధికార‌ప‌క్షం ఉన్న తెలంగాణ‌లో బోలెడ‌న్ని రాజ‌కీయ పార్టీలు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా పురుడు పోసుకోవ‌టానికి కార‌ణం.. బ‌ల‌హీన‌మైన ప్ర‌తిప‌క్షంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీకి అంకురార్ప‌ణ జ‌రిగింది. యువ తెలంగాణ పేరుతో జిట్టా బాల‌కృష్ణారెడ్డి.. రాణి రుద్ర‌మ‌లు క‌లిసి కొత్త పార్టీని స్టార్ట్ చేశారు. ఈ సంద‌ర్భం మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

రాజ‌కీయాల్లోకి యువ‌త‌.. మ‌హిళ‌లు పెద్ద ఎత్తున రావాల‌ని జిట్టా పిలుపునిచ్చారు. మ‌హిళ‌ల‌కు రాజ‌కీయ అవ‌కాశాలు క‌ల్పించ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా చెప్పారు. రాణి రుద్ర‌మ మాట్లాడుతూ తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మ‌హిళ‌ల‌కు అవ‌కాశాలు లేకుండా పోయాన‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ఒక్క‌రంటే ఒక్క మ‌హిళా మంత్రి కూడా లేక‌పోవ‌టాన్ని ఆమె ప్ర‌శ్నించారు. త‌మ పార్టీలో యువ మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంద‌ని ఆమె పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఉన్న పార్టీలు చాల‌వ‌న్న‌ట్లుగా వ‌చ్చిన ఈ కొత్త పార్టీ ఎంత మేర ప్ర‌భావం చూపుతుందో చూడాలి.