Begin typing your search above and press return to search.

లక్ష్యం చిన్నదే అయినా చెమటోడ్చి నెగ్గిన గుజరాత్!

ఈ సమయంలో లక్ష్యం చిన్నదైనా గుజరాత్ చెమటోడ్చిందనే చెప్పాలి. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.

By:  Tupaki Desk   |   22 April 2024 4:42 AM GMT
లక్ష్యం చిన్నదే అయినా చెమటోడ్చి నెగ్గిన గుజరాత్!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఒక వైపు రసవత్తరమైన భారీ మ్యాచ్ లు నడుస్తున్న సంగతి తెలిసిందే. 20 ఓవర్లలో 250 పైచిలుకు పరుగులు రాబడుతున్న మ్యాచ్ లు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. గుజరాత్ కు పంజాబ్‌ కింగ్స్‌ 143 పరుగుల లక్ష్యమే నిర్దేశించింది. దీంతో ఇంకా ఏడు నుంచి ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే పని పూర్తిచేస్తారేమో అనే కామెంట్లు వినిపించాయి. కానీ... అలా జరగలేదు.. గుజరాత్ కు చెమటోడ్చడం తప్పలేదు.

అవును... గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ సండే భారీ స్కోర్ల మజాను అందించలేదనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (35: 21 బంతుల్లో 3×4, 3×6) టాప్‌ స్కోరర్‌ గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్లు సాయికిశోర్‌ 4 వికెట్లు, నూర్‌ అహ్మద్‌ రెండు వికెట్లు, మోహిత్ రెండు వికెట్లు, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్ తీసి ఆ జట్టును దెబ్బతీశారు.

ఈ సమయంలో లక్ష్యం చిన్నదైనా గుజరాత్ చెమటోడ్చిందనే చెప్పాలి. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఛేజింగ్ లో ఇది ఈ సీజన్ ఐపీఎల్ అనిపించకుండా కదిలారు! రాహుల్‌ తెవాతియా (36 నాటౌట్‌: 18 బంతుల్లో 7×4), గిల్‌ (35: 29 బంతుల్లో 5×4) రాణించడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బౌలర్స్ లో హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు, లివింగ్‌ స్టన్‌ 2 వికెట్లు సాధించారు.

వాస్తవానికి లక్ష్యం చిన్నదైనా గుజరాత్ పై ఒత్తిడి తెచ్చి మ్యాచ్ ని రసపట్టులోకి తేవడంలో పంజాబ్ బౌలర్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇందులో భాగంగా.. సాహా (13), మిల్లర్‌ (4), అజ్మతుల్లా (13)లను వరుసగా పెవిలియన్ కు పంపగలిగారు. ఫలితంగా... 16 ఓవర్లకు టైటాన్స్‌ స్కోరు 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే! దీంతో.. చివరి 4 ఓవర్లలో 38 పరుగులు చేయాల్సి స్థితిలో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది.

మరోవైపు పంజాబ్ శిభిరంలోనూ ఆశలు చిగురించాయి. కానీ తెవాతియా ఆ అవకాశం ఇవ్వలేదు. బ్రార్‌ బౌలింగ్‌ లో రెండు ఫోర్లు, రబాడ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో మ్యాచ్‌ పూర్తిగా టైటాన్స్‌ వైపు తిరిగింది. చివరి రెండు ఓవర్లలో అయిదు పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్‌ లక్ష్యం చాలా తేలికైపోయింది.