Begin typing your search above and press return to search.

ఇంటిపేర్లు లేకున్నా పాస్ పోర్టులు.. సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు

ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన అబ్దుస్ సత్తార్ ముఠా.. అధికారుల్ని డీల్ చేసిన తీరు షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 6:30 AM GMT
ఇంటిపేర్లు లేకున్నా పాస్ పోర్టులు.. సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు
X

పాస్ పోర్టు జారీకి కచ్ఛితమైన మార్గదర్శకాలు ఉన్న విషయం తెలిసిందే. చిన్న పొరపాటుకు సైతం పాస్ పోర్టు జారీ కాకుండా ఆగిపోవటం తెలిసిందే. అలాంటిది.. పాస్ పోర్టు కోసం అప్లై చేసిన అప్లికేషన్ లో దరఖాస్తుదారుడి ఇంటి పేరు లేకున్నా.. తప్పుడు పత్రాలు సమర్పించినా.. గుట్టుచప్పుడు కాకుండా పాస్ పోర్టులు జారీ అయిన షాకింగ్ నిజాలు తాజాగా సీఐడీ విచారణలో బయటకు వస్తున్నాయి. నకిలీ పత్రాలతో పాస్ పోర్టులు జారీ అయ్యే రాకెట్ కు సంబంధించి సీఐడీ జరిపిన విచారణలో బయటకు వచ్చిన అంశాల్ని చూస్తే.. నిఘా వ్యవస్థలు మాత్రమే కాదు.. పాస్ పోర్టు కార్యాలయం పని తీరు మీద కొత్త సందేహాలు కలిగే పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.

ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన అబ్దుస్ సత్తార్ ముఠా.. అధికారుల్ని డీల్ చేసిన తీరు షాకింగ్ గా మారింది. నకిలీ పేరు.. వాటికి అనుబంధంగా నకిలీధ్రువపత్రాలు.. అన్నింటికి మించి ఇంటి పేరు లేకుండా అప్లికేషన్ పెడితే.. వాటిని నేరుగా రిజెక్టు చేయాల్సి ఉంది. ఒకవేళ.. ప్రాసెస్ లో భాగంగా ఎస్ బీ (స్పెషల్ బ్రాంచ్) సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతుంది. పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసిన వారి వద్దకు వెళుతుంది. వారి వివరాల్ని జాగ్రత్తగా క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంత ప్రొసీజర్ ను పక్కన పెట్టేసి.. అడ్డదిడ్డంగా పాస్ పోర్టులు జారీ చేసేలా జరిగిన తతంగం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.

మామూళ్ల మత్తులో పడి ఇష్టారాజ్యంగా పాస్ పోర్టుల జారీకి బాధ్యులైన నలుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి పాత్రపై సీఐడీ ఆరా తీస్తోంది. తాజాగా విచారణ చేపట్టిన సీఐడీ.. తమ విచారణలో ఇలాంటి బోగస్ పాస్ పోర్టులు జారీ అయిన వారిలో ఎక్కువగా శ్రీలంక.. మయన్మార్.. బంగ్లాదేశ్ దేశస్థులకు ఎక్కువగా బోగస్ పాస్ పోర్టులు ఇప్పించినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన 92 బోగస్ పాస్ పోర్టుల్లో ఎక్కువమంది శరణార్ధి శిబిరాల్లో ఉండే వారిగా గుర్తించారు. వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఏమైనా పాస్ పోర్టుల జారీలో ఇంతటి చేతివాటాన్ని ప్రదర్శించిన తీరు మాత్రం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.