Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే తొలిసారి.. ఆ నగరంలో ఎంట్రీకి టికెట్!

ఈ కారణంగా భారీగా రద్దీ నెలకొనటంతో తమ సిటీకి వచ్చే టూరిస్టుల నుంచి ఎంట్రీ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   24 April 2024 4:29 AM GMT
ప్రపంచంలోనే తొలిసారి.. ఆ నగరంలో ఎంట్రీకి టికెట్!
X

ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో ఒక అందమైన నగరంలోకి అడుగుపెట్టాలంటే ఎంట్రీ ఫీజు కట్టి.. టికెట్ సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకిలా? ఇంతకు ఎంత ఖర్చు అవుతుంది? ఇంతకూ ఆ సిటీ ఏమిటన్న విషయాల్లోకి వెళితే.. ఇటలీలోని బ్యూటీఫుల్ ప్లేస్ వెనిస్. ఈ నగరాన్ని చూసేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరానికి వచ్చి.. దానికి ఇట్టే కనెక్టు అయిపోతారు. రోజులు కొద్దీ గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగా భారీగా రద్దీ నెలకొనటంతో తమ సిటీకి వచ్చే టూరిస్టుల నుంచి ఎంట్రీ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు.

పర్యాటకుల సంఖ్యను తగ్గించటమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం ప్రపంచంలో మరే నగరంలోనూ లేదంటున్నారు. ఏప్రిల్ 25న తొలిసారి వెనిస్ కు వచ్చే సందర్శకుల నుంచి 5 యూరోలు చొప్పున వసూలు చేస్తారు. మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.444. అది కూడా డే ట్రిప్ కోసం వసూలు చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

తమ నగరంలోని సందర్శకుల రద్దీని తగ్గించటానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని.. ప్రపంచంలో మరెక్కడా లేదని వెనిస్ నగర మేయర్ లుయిగి బ్రుగ్నారో చెప్పారు. టికెట్ తీసుకోకుండా సిటీలోకి అడుగుపెడితే మాత్రం 50 నుంచి 300 యూరోల మధ్య ఫైన్ విధిస్తామని వెల్లడించారు. అయితే.. ఈ పరిస్థితి ఏడాది పొడుగునా ఉండదని.. రద్దీ రోజుల్లో మాత్రమేనని చెబుతున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 29 రోజుల్లో ఇలా ఛార్జ్ చేస్తారంటున్నారు.

2022లో వెనిస్ నగరంలో 32 లక్షల మంది బస చేశారు. ఇక్కడి ప్రతి ఇల్లు.. హోటల్ గానో.. రెస్టారెంట్ గానో మారింది. దీంతో స్థానికులకు ఇళ్లు అద్దెకు దొరకటం కష్టంగా మారింది. దీంతో ఈ నగరంలో నివసించటానికి ప్రజలు ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడు ఈ నగర జనాభా 1.2లక్షల మంది కాగా.. ఇప్పుడు యాభై వేలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల తాకిడిపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో.. టూరిస్టుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేయాలన్న కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. అయితే.. ఇలా వసూలు చేయటం ద్వారా పర్యాటకుల్ని కోల్పోతామని భావిస్తున్నారు మరికొందరు. మరీ.. ప్రయోగం ఏమవుతుందో చూడాలి.