ఇది కూడా వలంటీర్లకు అప్పజెప్పి ఉంటే.. ఏపీలో మహిళల స్పందన ఏంటంటే
ఇప్పుడు ఠారెత్తుతున్న టమాటాల ధరల నేపథ్యంలో సామాన్యులు నిత్యవసరమైన వాటిని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు
ఏపీలోని వైసీపీ సర్కారు ప్రతి విషయాన్నీ ఇంటింటికీ చేరుస్తున్న విషయం తెలిసిందే. పింఛను నుంచి రేషన్ వరకు.. ప్రజలు గడప దాటకుండా వలంటీర్ వ్యవస్థ, నూతనంగా కోట్లు పోసి కొనుగోలు చేసిన రేషన్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు.. వలంటీర్ల ద్వారా పింఛన్లు, ఇతర పథకాలను కూడా ఇంటికే అందిస్తోంది. దీనిని రాజకీయంగా కూడా బాగానే వాడుకుంటు న్నారు వైసీపీ నాయకులు. ఇటీవల వలంటీర్ వ్యవస్థపై వివాదం చెలరేగినప్పుడు.. ఇదే విషయాన్ని వైసీపీ మంత్రులు, నాయకులు కూడా ప్రస్తావించారు.
''గతంలో ఎప్పుడైనా ఇంటింటికీ పింఛను రావడం చూశామా? ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చుకుని టైం వేస్టు చేసుకుని.. రోజుల తరబడి పింఛను కోసం క్యూలలో నిలబడ్డారు. ఇప్పుడు సీఎం జగన్ గారు ఎంతో దూర దృష్టితో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే పింఛన్లు, రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ఇదంతా ఎవరు చేస్తున్నారు వలంటీర్లే కదా! ఈ విషయం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా!" అని మంత్రి రోజా నిప్పులుచెరిగిన విషయం గుర్తింది కదా! ఆమె ఒక్కరే కాదు.. దాదాపు ఈ విషయంపై స్పందించిన ప్రతి ఒక్కరూ ఈ విషయమే చెప్పుకొచ్చారు.
కట్‌చేస్తే.. ఇప్పుడు ఠారెత్తుతున్న టమాటాల ధరల నేపథ్యంలో సామాన్యులు నిత్యవసరమైన వాటిని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. దీనిపై స్పందించిన వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇతర రాష్ట్రాల కంటే కూడా ముందుగానే రియాక్ట్ అయింది.
ప్రభుత్వమే టమాటాలని కొనుగోలు చేసి.. తక్కువ ధరలకే అందిస్తోంది. మంచిదే. ఈ ప్రయత్నాన్ని అందరూ హర్షించాల్సిందే. అయితే.. ఇప్పుడు ఎక్కడ రైతు బజార్లు చూసినా.. కిలో మీటర్ల కొద్దీ క్యూ కనిపిస్తోంది.
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు కూడా.. ఈ క్యూలలో టమాటాల కోసం గంటలు కాదు.. పూటల తరబడి నిలబడుతున్నారు. మరి ఇలా క్యూలలో నిలబడి టైం వేస్టు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే కదా.. వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు టమాటాల విషయంలో ఎందుకు ప్రజలను రోడ్లపై నిలబెడుతున్నారనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న టాక్.
ఇప్పుడు ఇల్లిల్లూ ఎందుకు గుర్తుకు రావడం లేదు. వలంటీర్లతో రేషన్ ను ఇంటికి పంపిస్తున్నారు కదా.. టమాటాలను కూడా ఇంటింటికే పంపిస్తే.. బాగుంటుంది కదా! అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కడపలోనూ వినిపిస్తుండడం మరింత విశేషం. ఇక్కడ రెండు కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.