చిరు నేతల మీడియా గోల...
మరోవైపు ప్రింటు మీడియా పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు
వైసీపీలో మీడియా గోల భారీగా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎన్నికలకు ముందు.. నాయకులు కోరుకునే ది ప్రచారమే. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు తుమ్మినా.. దగ్గినా కూడా.. ప్రచారం కోరుకుంటారనే అందరికీ తెలిసిందే. నాయకులు ధరించే దుస్తుల నుంచి పెట్టుకునే ఉంగరాల వరకు.. నడిచే దారుల నుంచి ఎక్కే వాహనాల వరకు వార్తలుగా ఉంటున్నాయి. అయితే.. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో కీలక నాయకుల చుట్టూనే మీడియా తిరుగుతోంది.
దీంతో ప్రధమ శ్రేణిలోనే ఉన్నా.. ద్వితీయ శ్రేణిగా పరిగణించే నాయకులు చాలా మందికి మీడియా అందుబాటులో లేకుండా పోయిందట. దీంతో నాయకులు తల్లడిల్లుతున్నారు. బాబ్బాబు.. మా కార్యక్ర మం కవర్ చేయండి.. అంటూ.. స్థానిక చానెళ్లను.. వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు పుట్టగొడుగుల్లా.. లోకల్ మీడియా చానెళ్లు పుట్టుకు వస్తున్నాయి. వీరికి ప్యాకేజీలు కూడా బాగానే ఉన్నాయని ఒక టాక్ నడుస్తోంది.
మరోవైపు ప్రింటు మీడియా పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు. ప్రధాన వార్తా పత్రికల్లో వార్తలన్నీ.. పార్టీల అధినేతలు, కేంద్ర రాజకీయాలతోనే సరిపోతోంది. దీనికి తోడు కరోనా కష్టాలను తగ్గించుకునేందుకు పత్రికలు పేజీలను పెంచడం లేదు. ఫలితంగా ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ప్రొజెక్షన్ లేకుండా పోయిందట. దీంతో వారు ప్రింట్ మీడియాను పిలిచినా.. ప్రతినిధులు వచ్చినా.. తెల్లారి పేపర్‌లో వార్త కనిపించే వరకు డౌటే!
దీంతో ఇప్పుడు వైసీపీ నాయకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. వెబ్ సైట్లను వారు ఆశ్రయిస్తున్నారు. బాబ్బాబు.. మీరైనా.. మా వార్తలు వేసుకోండి. అని కోరుతున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య..పేపర్లకు ఉన్న ఫాలోయింగ్.. సైట్లకు లేకపోవడం. పైగా.. డిజిటల్ మీడియాను ఎంత మంది ఫాలో అవుతున్నారనేది ప్రధాన సమస్య. దీంతో నాయకుల మీడియాకవరేజీ కోసం.. పెద్ద నాయకుల సిఫారసులు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.