11 నెలల్లో భారత్ నుంచి రూ.లక్ష కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతులు
రోజులు మారాయి. గతానికి భిన్నమైన పరిస్థితులు పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి
రోజులు మారాయి. గతానికి భిన్నమైన పరిస్థితులు పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఐఫోన్ అంటే.. అక్కడెక్కడో ఉత్పత్తి అయి.. తిరిగితిరిగి మన దేశానికి వచ్చేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా భారత్ లోనే ఐఫోన్లు భారీగా ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తాజాగా వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఐఫోన్లలో భారత్ నుంచే అధికంగా ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీనికి కారణంగా ఐఫోన్లను ఉత్పత్తి చేసే ఫాక్స్ కాన్.. పెగాట్రాప్.. విస్ట్రాన్ లాంటి కంపెనీలు దేశంలోకి అడుగు పెట్టటం.. తమ ఫ్యాక్టరీలను నెలకొల్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పీఎల్ఐ పేరుతో అమలు చేస్తున్న పథకం సత్ఫలితాలు ఇవ్వటమే కాదు.. పెద్ద ఎత్తున ఉత్పత్తికి అవకాశాన్ని ఇస్తోంది. ఉత్పత్తి చేయటం.. ఎగుమతులు.. ఉద్యోగ కల్పలనకు సంబంధించిన పథకం ఇప్పుడు కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలోని 11 నెలల్లో యాపిల్ సంస్థ రూ.లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేసింది. యాపిల్ సంస్థ ఉత్పత్తి చేసే ఐఫోన్లలో ప్రతి మూడు ఫోన్లలో రెండు భారత్ లోనే తయారు కావటం విశేషం. త్వరలోనే కేరళ రాజధాని తిరువనంతపురంలోనే పరిశ్రమల్ని ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. ఇక.. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు.
ఇందుకు నిదర్శనంగా కొన్ని గణాంకాల్ని చూస్తే.. దేశంలో సెల్ ఫోన్ల ఉత్పత్తి ఎంత పెరుగుతుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. 2014-15లో రూ.18,900లుగా ఉన్న సెల్ ఫోన్ల ఉత్పత్తి 2024 ఆర్థిక సంవత్సరానికి 20రెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం ఎగుమతుల విలువ అక్షరాల రూ.4.10 లక్షల కోట్లకు చేరటం గమనార్హం. గడిచిన పదేళ్లలో భారత్ లో 245 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అయిన వైనం తెలిస్తే.. భారత్ లో సెల్ ఫోన్ల ఉత్పత్తి ఎంత భారీగా పెరిగిందన్న విషయం అర్థమవుతుంది. పదేళ్ల క్రితం మన దేశంలో అమ్మిన మొత్తం మొబైల్ ఫోన్లలో 78 శాతం దిగుమతి చేసుకునే పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా దేశంలో అమ్ముడయ్యే మొబైల్ ఫోన్లలో 97 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న పరిస్థితి. ఇంతలా సెల్ ఫోన్ల ఉత్పత్తి పెరిగింది.