ఏపీకి మరో ఫేమస్ కంపెనీ.. పెట్టుబడులు ఎన్నంటే?

ఒకప్పుడు విలాసానికి ప్రతిరూపంగా ఉండే ఏసీలు ఇప్పుడు సాధారణమయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఏసీల వాడకం ఇప్పుడు కామన్ గా మారాయి.

Update: 2024-12-18 06:00 GMT

ఒకప్పుడు విలాసానికి ప్రతిరూపంగా ఉండే ఏసీలు ఇప్పుడు సాధారణమయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఏసీల వాడకం ఇప్పుడు కామన్ గా మారాయి. ఇప్పుడు ఏసీలను ఎవరూ లగ్జరీగా చూడటం లేదు. అవసరమైన వస్తువుల జాబితాలోకి ఏసీ వచ్చేసింది. ఇక.. ఏసీలకు సంబంధించిన ప్రముఖ కంపెనీలు అన్నంతనే పలు పేర్లు గుర్తుకు వస్తాయి. అందులో తప్పనిసరిగా ఉండేది డైకిన్. జపాన్ కు చెందిన ఈ కంపెనీ పేరు చెప్పినంతనే ఏసీలు.. ఫ్రిజ్ లతో పాటు పలు ఎలక్ట్రికల్ వస్తువులు గుర్తుకు వస్తాయి.

అలాంటి ప్రముఖ కంపెనీ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీలోని శ్రీసిటీలో 75 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో కంప్రెసర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. డైకిన్ ఇండియా.. రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్.. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో వాడే రోటరీ కంప్రెసర్లను తయారు చేస్తారు. వీటిని దేశీయంగానే కాదు.. కొన్ని దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులో మెజార్టీ వాటాదారుగా డైకిన్ ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25 మార్చి 31 లోపు) లోపే పెట్టుబడుల ప్రతిపాదన కార్యరూపంలోకి రానుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేసే యూనిట్ తో కలిపి దేశంలో మూడు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అవుతుంది. మరో ప్రత్యేకత ఏమంటే.. ఈ సంస్థకు శ్రీసిటీలో ఏర్పాటు చేసే యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతి పెద్దది.

ప్రస్తుతం దేశంలో 20 లక్షల ఏసీ యూనిట్లను డైకిన్ తయారు చేస్తోంది. మరో ఆరేళ్లలో అంటే 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 50 లక్షల యూనిట్లకు చేర్చాలన్నదే లక్ష్యంగా కంపెనీ భావిస్తోంది. దేశీయంగా ఏసీ అమ్మకాల్లో మెజార్టీ వాటాను సొంతం చేసుకోవాలన్నది డైకిన్ లక్ష్యంగా చెబుతున్నారు. తాజా ఒప్పందంతో మధ్యతరగతి వారికి తక్కువ ధరలకే ఏసీలను అందించటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఏపీకి వస్తున్న కంపెనీల జాబితాలో డైకిన్ చేరినట్లైంది.

Tags:    

Similar News