'గో ఫస్ట్' ను సొంతం చేసుకోవటానికి స్పైస్ జెట్ ఆసక్తి

మొదట్నించి చెబితే విషయం ఇట్టే అర్థమవుతుంది. దేశంలోని విమానయాన సంస్థల్లో గోఫస్ట్ ఒకటి. అయితే.. మిగిలిన వాటిలో పోలిస్తే దీని స్థాయి చిన్నదే.

Update: 2024-02-17 04:03 GMT

ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న కంపెనీకి అధినేతగా ఉండి.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మరో వ్యాపారాన్ని సొంతం చేసుకోవటానికి ఆసక్తి చూపటం సాధ్యమవుతుందా? అంటే.. కాదనే చెబుతారు ఎవరైనా. అలానే చేస్తే ఆయన అజయ్ సింగ్ ఎందుకు అవుతారు? ఎవరీ అజయ్ సింగ్ అంటారా? మొదట్నించి చెబితే విషయం ఇట్టే అర్థమవుతుంది. దేశంలోని విమానయాన సంస్థల్లో గోఫస్ట్ ఒకటి. అయితే.. మిగిలిన వాటిలో పోలిస్తే దీని స్థాయి చిన్నదే.

ఈ గో ఫస్ట్ విమానయాన సంస్థ గత మేలో కార్యకలాపాల్ని నిలిపేసి.. దివాలా ప్రక్రియను షురూ చేయటం తెలిసిందే. దీన్ని సొంతం చేసుకోవటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిజీ బీ ఎయిర్ వేస్ తో కలిపి.. స్పైస్ జెట్ అధినేత అజయ్ సింగ్ పర్సనల్ హోదాలో దీన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా బిడ్ వేయటం ఆసక్తికరంగా మారింది.

ఓవైపు తాను సారథ్యం వహిస్తున్న స్పైస్ జెట్ లో వ్యయ నియంత్రణలో భాగంగా వెయ్యి మంది సిబ్బందిని తొలగిస్తూ మరిన్ని చర్యలు తీసుకోవటం తెలిసిందే. ఒకవైపు తాను అధిపతిగా ఉన్న సంస్థ కిందా మీదా పడుతున్న వేళ.. పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న గో ఫస్ట్ ను సొంతం చేసుకోవటానికి ఆసక్తిని చూపడటం పెద్ద ట్విస్టుగా మారింది.

గో ఫస్ట కోసం షార్జాకు చెందిన స్కై వన్ ఎఫ్ జడ్ కూడా బిడ్ దాఖలు చేయటం తెలిసిందే. దీనికి ముందు ఆఫ్రికాకు చెందిన సఫ్రిక్ ఇన్వెస్ట్ మెంట్ కూడా గో ఫస్ట్ కొనుగోలుకు ఆసక్తిని చూపింది. ఈ సంస్థలన్నీ గో ఫస్ట్ కొనుగోలుకు ఆసక్తి చూపించటం ఒక ఎత్తు అయితే.. బిజీ బితో స్పైస్ జెట్ అధినేత వ్యక్తిగత హోదాలో వేసిన బిడ్ అందరిని ఆకర్షిస్తోంది. కార్పొరేట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గో ఫస్ట్ ను సొంతం చేసుకుంటే.. సదరు విమానయాన సంస్థకు స్పైస్ జెట్ ఒక నిర్వాహణ భాగస్వామిగా ఉంటుంది. దీంతో.. వ్యయ నియంత్రణతో పాటు.. ఆదాయాన్ని పెంచుకునే వీలుంది. మార్కెట్లో మరింత బలోపేతం కావొచ్చన్న ఆలోచనలో భాగంగా ఇలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

గో ఫస్ట్ కు దేశీయ.. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉన్న స్లాట్లు.. అంతర్జాతీయ రద్దీ హక్కులు ఉన్నాయి. గతంలో ఈ సంస్థ వంద ఎయిర్ బస్ నియో విమానాలకు ఆర్డర్ ఇవ్వటం తెలిసిందే. గో ఫస్ట్ ను సొంతం చేసుకోవటం ద్వారా మళ్లీ ఈ బ్రాండ్ కు పునరుజ్జీవం సులువుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే వ్యక్తిగత హోదాలో బిడ్ వేసినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News