పిల్లలు కాదు.. సంక్రాంతి చిచ్చర పిడుగులు..!

పండక్కి రిలీజై హిట్టు కొట్టిన 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాల్లో నటించిన చిన్నారులు వేద అగర్వాల్, భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ లు తమ నటనతో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు.

Update: 2025-01-16 05:53 GMT

'పిట్ట కొంచెం.. కూత ఘనం' అనే సామెతను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. చిన్నతనంలోనే ఘనమైన కార్యాలు చేసిన సందర్భంలో కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలలో అలరించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులకు ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. పండక్కి రిలీజై హిట్టు కొట్టిన 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాల్లో నటించిన చిన్నారులు వేద అగర్వాల్, భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ లు తమ నటనతో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీకి ఇప్పుడు ఆల్ ఏరియాస్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ కళకళలాడిపోతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరో వెంకటేష్ కొడుకు బుల్లి రాజుగా నటించిన మాస్టర్ రేవంత్ హైలైట్ గా నిలిచాడు. కాస్త బొద్దుగా ఎంతో క్యూట్ గా ఉండే ఈ బుడ్డోడి మీద తీసిన కొన్ని సన్నివేశాలు ఫస్టాఫ్ లో చాలా బాగా పేలాయి.

ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన పిల్లాడిగా రేవంత్ పాత్రను డిజైన్ చేసారు అనిల్ రావిపూడి. వెంకీ మీదకు గ్రామస్థులు గొడవకు వచ్చే ఓ సీన్ లో మనోడి నటన పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. అలానే తాత ఫ్రెండ్ కు కౌంటర్ ఇచ్చే మరో సన్నివేశంలోనూ అలరించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన రివ్యూలో బుల్లి రాజు పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడంటే, రేవంత్ భీమల ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసాడో అర్థమవుతుంది.

అలానే బాబీ డైరెక్షన్ లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కూతురిగా నటించిన వేద అగర్వాల్ కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. అంత చిన్న వయసులో చిన్నారి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, పర్ఫార్మన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక యాక్షన్ సీన్ లో వేద రోప్ కట్టుకొని మరీ నటించింది. ఇక సినిమాలో ఆమె పాత్ర మీద 'చిన్ని' అనే పాటను కూడా రూపొందించారు. ఇక బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాతో వేద ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎలా ఉందో కొన్ని వీడియోలలో మనం చూశాం. మాధవ్ అనే సింగర్ కూతురు వేద. ఇంతకు ముందు 'గాండీవధారి అర్జున' సినిమాలో చిన్న పాత్ర చేసింది.

ఇలా ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలలో ఇద్దరు బాల నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. పిట్ట కొంచెం.. నటన ఘనం అని మాట్లాడుకునేలా చేసారు. 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు చూసిన జనాలు చిన్ని, బుల్లి రాజు పాత్రల గురించి మాట్లాడకుంటున్నారంటే, ఇద్దరు పిల్లలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసారో చెప్పాల్సిన పనిలేదు.

Tags:    

Similar News