అవార్డు విన్నింగ్ నటి.. ఆ భయంతో సైబర్ నేరగాళ్లకు దొరికింది

ఆమె నటన వెండితెరకు వెలుగునిస్తుంది. అవార్డులు ఆమె నటనకు ఫిదా అవుతాయి. అయితే.. అదంతా రీల్ జీవితం.

Update: 2024-01-03 06:19 GMT

ఆమె నటన వెండితెరకు వెలుగునిస్తుంది. అవార్డులు ఆమె నటనకు ఫిదా అవుతాయి. అయితే.. అదంతా రీల్ జీవితం. కానీ.. రియల్ లైఫ్ లో మాత్రం సైబర్ దొంగల అద్భుత నటనకు ఆమె అడ్డంగా బుక్ అయ్యారు. లక్షలాది రూపాయిల్ని పోగొట్టుకున్నారు. తెలివైన నటిగా పేరున్న ఆమె.. సైబర్ దొంగల చేతికి ఎలా చిక్కారు? ఆమె ఎలా మోసపోయారన్నది చూసినప్పుడు.. మనలో చాలామందికి ఇలాంటి ఫోన్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఎలా రియాక్టు కావాలో చెప్పే అనుభవంగా దీన్ని తీసుకోవాలి.

తెలుగు.. తమిళ్.. హిందీ.. మరాఠీ చిత్రాలు చేసి గుర్తింపు పొందిన ఆ నటి మరెవరో కాదు అంజలి పాటిల్. పేరు విన్నట్లుందే అనిపించినా.. గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. తెలుగులో నా బంగారు తల్లిలో లీడ్ రోల్ చేసిన నటి అన్నంతనే ఆమె గుర్తుకు వస్తుంది. ఈ సినిమాకు ఆమె నంది అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం హిందీ.. మరాఠి చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమెకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. సైబర్ మోసగాళ్ల వలలో ఆమె చిక్కుకున్నారు.

డిసెంబరు 28న దీపక్ శర్మ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి.. ఫెడ్ ఎక్స్ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరుతో ఒక పార్సిల్ వచ్చిందని.. అయితే.. అది డ్రగ్స్ తో ఉందని అది తైవాన్ లో పట్టుబడినట్లుగా పేర్కొన్నారు. పార్సిల్ లోనే ఆధార్ కార్డు కాపీ ఉందన్నాడు. దీంతో.. డ్రగ్స్ నేరం ఆమె మీద పడే అవకాశం ఉందని భయపెట్టాడు. దీంతో.. తన ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని భయపడిన ఆమె.. తాను ముంబయి సైబర్ క్రైం పోలీసుల్ని సంప్రదిస్తానని చెప్పారు.

ఇది జరిగిన కాసేపటికి ఆమెకు సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా ఒకరు ఫోన్ చేశారు. ఆమె ఆధార్ కార్డు.. బ్యాంకు ఖాతాలకు కనెక్టు అయి ఉందని.. ఆమె మనీలాండరింగ్ కేసులో చిక్కుకునే ప్రమాదం ఉందని భయపెట్టాడు. దీంతో ఈసారి ఆమె కన్ఫ్యూజన్ కు గురి కావటమే కాదు.. భయాందోళనలకు గురయ్యారు. ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ఆమె నుంచి రూ.96,525 పంపమని కోరగా.. ఆమె పంపారు. ఆ తర్వాత ఆమెను ఈ వ్యవహారంలో విచారణ కోసం వెంటనే రూ.4.83 లక్షల పంపాలని చెప్పాడు.

ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఆమె అతడు చెప్పినట్లుగా ఆ డబ్బుల్ని పంపేశారు. అయితే.. కాసేపటికే తాను మోసపోయినట్లుగా గుర్తించారు. మొత్తంగా ఆమె రూ.5.79లక్షల మేర మోసపోయారు. దీంతో సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమె పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఏమైనా.. పేరున్న నటిని సైతం సైబర్ నేరస్తులు బోల్తా కొట్టించిన వైనం షాకింగ్ గా మారింది.

Tags:    

Similar News