సైబర్ నేరగాళ్లు.. ఈసారి కొత్త ఫోన్ గిఫ్ట్ పంపించారు.. తర్వాత?

ఈ క్రమంలో తాజాగా లాటరీ తగిలిందని ఓ కొత్త ఫోన్ పంపి.. అది ఆన్ చేసుకోగానే కోట్ల రూపాయలు కొట్టేసిన షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది

Update: 2025-01-20 05:06 GMT

పలు సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఆలోచనలు చూస్తుంటే.. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్ధమవుతుందని అనిపిస్తుంటుంది. అత్యంత సాధారణంగా జరిగే విషయాలను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లాటరీ తగిలిందని ఓ కొత్త ఫోన్ పంపి.. అది ఆన్ చేసుకోగానే కోట్ల రూపాయలు కొట్టేసిన షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. వాట్సప్ వీడియో కాల్, కొరియర్ లో రాంగ్ పార్శిల్, ఆన్ లైన్ లో తప్పుడు ఆర్డర్స్, కొరియర్ పార్శిల్ లో డ్రగ్స్... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగానూ ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని లాటరీ పేరు చెప్పి ఎలా ముంచేశారో ఇప్పుడు చూద్దామ్..!

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఇటీవల సైబర్ నేరస్థులు ఫోన్ చేసి.. "మీరు కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేశారు.. ఇలా కొన్నవారందరి పేరుతో లాటరీ తీశాము.. అందులో మీకు లాటరీ తగిలింది.. ఇందులో భాగంగా మీరు కొత్త మొబైల్ ఫోన్ ను గెలుచుకున్నారు అని చెప్పారు. అనంతరం కొరియర్ ద్వారా మొబైల్ ఫోన్ ను ఇంటికి పంపించారు!

ఇక... లాటరీలో ఫోన్ వచ్చిందన్న సంతోషంతో ఉన్న సదరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్... తన పాత ఫోన్ లోని సిమ్ కార్డును తీసి, కొత్త దాంట్లో వేశారు. ఇలా సిమ్ వేసిన సుమారు గంట తర్వాత ఆ ఫోన్ కు పలు ఎస్సెమ్మెస్ లు వచ్చాయి, అందులో కొన్ని ఓటీపీలతో వచ్చినవి. సరే... కొత్త ఫోన్ కాబట్టి అలా వస్తున్నాయని భావించిన సదరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. వాటిని లైట్ తీసుకున్నారు.

అయితే... ఆ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు.. అందులో ఉన్న యాప్ లకు ఓటీపీలు అప్లై చేసి అతని ఖాతా నుంచి సుమారు రూ.2.8 కోట్లను కాజేశారు. దీంతో... ఆ విషయంలో కాస్త ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది.

Tags:    

Similar News