పెళ్లి క‌ల‌లు.. యువ‌తికి 6ల‌క్ష‌లు టోక‌రా వేసిన జ్యోతిష్కుడు !

లోటుపాట్ల‌ను పూజల ద్వారా పరిష్కరించవచ్చని చెప్పాడు. దాని కోసం అతడు ఏకంగా రూ.6 ల‌క్ష‌లు గుంజాడు.

Update: 2025-02-18 08:07 GMT

అధునాత‌న స‌మాజంలో పెళ్లి అనేది చాలామందికి పీడ క‌ల‌గా మారింది. త‌న‌కు పెళ్ల‌వుతుందా లేదా? ప్రేమ వివాహం అవుతుందా లేక‌ పెద్దలు కుదిర్చిన వివాహం అవుతుందా? అంటూ ఎన్నో సందేహాలు. ఇదే డౌట్ ఆన్ లైన్‌లో ప‌రిచ‌య‌మైన ఒక జ్యోతిష్కుడిని అడిగింది 24 ఏళ్ల బెంగ‌ళూరు యువ‌తి. విజయ్ కుమార్ అని తనను తాను పరిచయం చేసుకున్న మోసగాడు.. ఆ మహిళది ప్రేమ వివాహం అని, కానీ ఆమె జాతకంలో కొన్ని దోషాలున్నాయ‌ని జ్యోతిషంలో ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని న‌మ్మ‌బ‌లికాడు. లోటుపాట్ల‌ను పూజల ద్వారా పరిష్కరించవచ్చని చెప్పాడు. దాని కోసం అతడు ఏకంగా రూ.6 ల‌క్ష‌లు గుంజాడు. 

ఎలక్ట్రానిక్స్ సిటీ బెంగ‌ళూరులో మోసం ఇది. ఒక‌ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి అయిన ప్రియ (పేరు మార్చాం) దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. జనవరి 5న ఇన్‌స్టాలో splno1indianastrologer అనే ఖాతాలో ఒక వ్య‌క్తి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ప్రొఫైల్‌లో అఘోరి బాబా ఫోటో ఉంది. తాను ప్ర‌ముఖ జ్యోతిష్కుడిని అని అత‌డు న‌మ్మ‌బ‌లికాడు. విజయ్ కుమార్ అని పరిచయం చేసుకున్న అత‌డికి ప్రియా ఒక మెసేజ్ చేసింది. తన పేరు, పుట్టిన తేదీని వాట్సాప్ మెసేజ్ పంపి తన జాతకాన్ని చూడాల్సిందిగా కోరింది. వెంట‌నే అత‌డు జ్యోశ్యం చెప్ప‌డం ప్రారంభించాడు.

ఆమెకు ప్రేమ‌వివాహం అవుతుంద‌ని న‌మ్మించాడు. దీనికోసం రూ.1,820 ఖర్చయ్యే పూజ చేయాల్సి ఉంటుంద‌న్నాడు. డ‌బ్బును డిజిటల్ చెల్లింపు యాప్ ద్వారా చెల్లింపు చేయాలని కోరాడు. పెళ్లి అనే స‌మ‌స్య‌ను అత‌డు ఉప‌యోగించుకున్నాడు. తెలివిగా క‌థ‌లు అల్లాడు. వరుసగా పూజలు చేయాల‌నే నెపంతో డబ్బును దోచుకున్నాడు. అతడికి దాదాపు రూ.6 లక్షలు చెల్లించిన తర్వాత కూడా ఇంకా డబ్బు గుంజాల‌ని చూసాడు. చివ‌రికి తనను మోసం చేస్తున్నాడని గ్రహించి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

అయితే డ‌బ్బు వెన‌క్కిస్తున్నాన‌నే పేరుతో రూ.13,000 తిరిగి ఇచ్చిన అత‌డు తనను బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని.. సూసైడ్ నోట్‌లో ఆమె పేరును కూడా రాస్తాన‌ని కుమార్ బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత, ప్రశాంత్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తనను తాను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడు. కుమార్ తన తరపున అనేక పూజలు చేసిన తర్వాత కూడా డబ్బు తిరిగి ఇవ్వమని ఆమె బలవంతం చేస్తుండటంతో ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నాడ‌ని న్యాయ‌వాది ప్రియాకు చెప్పాడు.

దీంతో ఇక ఈ మోసాన్ని భ‌రించ‌లేని ప్రియా తరువాత పోలీసులను సంప్రదించింది. మోసం జ‌రిగిన తీరును బ‌ట్టి సైబ‌ర్ కేటుగాళ్ల ప‌ని ఇద‌ని పోలీసులు నిర్ధారించారు. ఈ ఎపిసోడ్ లో జ్యోతిష్కులు లేరు.. న్యాయ‌వాది లేడు. కానీ మోసం జ‌రిగింది. ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం , బిఎన్ఎస్ సెక్షన్ 318 (మోసం) కింద కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

Tags:    

Similar News