మణిపుర్‌ లో ఆగని హింస... తాజాగా మరో ఘోరం!

అత్యంత దారుణమైన, ఆటవికమైన, పాశవికమైన ఘటనల కు కేంద్రంగా మారిన మణిపూర్ లో ఇంకా హింస ఆగలేదు.

Update: 2023-08-05 11:41 GMT

అత్యంత దారుణమైన, ఆటవికమైన, పాశవికమైన ఘటనల కు కేంద్రంగా మారిన మణిపూర్ లో ఇంకా హింస ఆగలేదు. మణిపూర్ లో జరుగుతున్న దారుణాల పై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ని విపక్షాలు కడిగిపారేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడ పరిస్థితి చక్కబడిందని బీజేపీ నేతలు చెప్పుతూనే ఉన్నారు కూడా!

అయినా కూడా ఇంకా మణిపూర్ అదుపులోకి వచ్చినట్లు లేదు. ఫలితంగా అటు రాష్ట్ర - ఇటు కేంద్ర ప్రభుత్వాల సమర్ధతని వేలెత్తి చూపుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అవును... జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతోన్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపుర్‌ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందిన వారని తెలుస్తోంది.

శుక్రవారం అర్ధరాత్రి వీరంతా గ్రామంలోని తమ ఇళ్లకు కాపాలా కాస్తున్నారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు గ్రామంలోకి ప్రవేశించారు. అనంతరం వీరి పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారు.

కేంద్ర భద్రతా దళాల బఫర్‌ జోన్‌ ను దాటుకుని దుండగులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్భంగా నిందితుల ను మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో క్వాక్టాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మణిపూర్ లో మళ్లీ టెన్షన్ వాతావరణం మొదటికి వచ్చిందని అంటున్నారు.

మరోపక్క ఈ ఘటన జరిగిన కాసేపటికే ఈ ప్రాంతం లో కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. వెంటనే రంగం లోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిచగా... వీరిమధ్య భీకర కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మణిపుర్‌ కమాండో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.

కాగా... ఇదే బిష్ణు పుర్‌ లో గురువారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయి ఆయుధాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. నారన్సీనా ప్రాంతంలో రెండో భారత రిజర్వు బెటాలియన్‌ (ఐ.ఆర్‌.బీ) ప్రధాన కార్యాలయం లోని ఆయుధాగారం పై దాడి చేసి భారీగా ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లారు.

కాగా... ఈ ఘటనలు మరోసారి జరుగుతుండటంతో మూడు నెలల నుండి సాగుతున్న ఈ మారణకాండ చల్లారేదెన్నడంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ ని ప్రశ్నిస్తున్నారు. మణిపూర్ ప్రజలు ప్రశాంతంగా కునుకు తీసేదెన్నడంటూ నిలదీస్తున్నారు.

Tags:    

Similar News