శామీర్‌ పేట కాల్పుల ఘటనలో కీలక మలుపు!

శామీర్ పేట కాల్పుల ఘటన

Update: 2023-07-17 06:48 GMT

హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్‌ పేటలో కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి రావడంతోపాటు... పేరు విషయంలో ఒక బిగ్ ట్విస్ట్ జరిగిందని తెలుస్తుంది.

అవును... శామీర్ పేట కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... తన బంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో సిద్ధార్థ దాస్‌ ను హతమార్చేందుకు.. సినీ నటుడు మామిడి మనోజ్‌ కుమార్‌ నాయుడు అలియాస్‌ సూర్యతేజ ప్రయత్నించాడని పోలీసులు నిర్ధారించారని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఏపీలోని విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ దాస్‌(49) ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్‌ కు చెందిన స్మిత గ్రంథికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగిందట. వీరికి కుమారుడు(17), కుమార్తె(13) ఉన్నారని తెలుస్తుంది. అయితే 2019లో మనస్పర్థలతో స్మిత విడాకులకు దరఖాస్తు చేశారని తెలుస్తుంది. ఆ సమయంలో వారు మూసాపేటలో నివాసముండేవారట.

అనంతరం ఇద్దరు పిల్లలతో ఒంటరిగానే ఉంటున్న స్మిత... మానసిక సమస్యలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేవారట. అదే సమయంలో విజయనగరం జిల్లా రాజాంకు చెందిన మనోజ్‌.. ఫేస్‌ బుక్‌ ద్వారా స్మితను సంప్రదించి కౌన్సిలింగ్‌ తీసుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే స్మిత తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనోజ్ తో పంచుకున్నారని.. అనంతరం ఇద్దరూ దగ్గరయ్యారని తెలుస్తుంది.

ఈ సమయంలో ఇద్దరూ కలిసి వ్యాపారం కూడా చేసుకుంటూ ఒకే ఇంటిలో ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో స్మిత ఇద్దరు పిల్లల చదువుల విషయంలో మనోజ్‌ కాస్త కఠినంగా వ్యవహరించేవాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా... స్మిత కుమారుడు ఇంటర్‌ లో ఫెయిలయ్యాడని మనోజ్‌ కొట్టాడని.. ఫలితంగా స్మిత కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల దగ్గర ఉంటున్నాడని అంటున్నారు.

ఈ క్రమంలో... తనను మనోజ్‌ వేధిస్తున్నాడంటూ బాలల సంరక్షణ కమిటీకి జులై 12న స్మిత కుమారుడు ఫిర్యాదు ఇచ్చాడట. తన చెల్లిల్ని కూడా వేధిస్తున్నారని తన తండ్రికి, సీడబ్ల్యూసీకి కూడా చెప్పాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుమార్తెను చూసేందుకు విశాఖలో ఉంటున్న సిద్ధార్థదాస్‌ శామీర్‌ పేటలో స్మిత, మనోజ్‌ ఉండే నివాసానికి వెళ్లాడట. దీంతో... సిద్ధార్థను హతమార్చి తమ బంధానికి అడ్డుతొలగించుకోవాలని మనోజ్‌ నిర్ణయించుకున్నాడని చెబుతున్నారని సమాచారం.

ఆ సంగతి అలా ఉంటే... ఈ సంఘటన జరిగిన వెంటనే "నటుడు మనోజ్ నాయుడు" అనే విషయంలో కొన్ని మీడియా ఛానళ్లు కన్ ఫ్యూజన్ లో పడ్డాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... "కార్తీక దీపం" యాక్టర్ మనోజ్ కుమార్ ఎవరిపైనో కాల్పులు చేశాడంటూ అతని ఫోటోలు, వీడియోలతో న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఆ మనోజ్ వేరు, ఈ మనోజ్ వేరనే విషయంపై స్పష్టత ఇచ్చారు కార్తీక దీపం మనోజ్!

అవును... "కార్తీక దీపం"లో ప్రేమ్‌ గా, ఇప్పుడు "మౌన పోరాటంలో ద్వారక" లోనూ నటిస్తున్న తాన పేరు కూడా మనోజ్ నాయుడే అని తెలిపిన ఆయన... అయితే శామీర్ పేటలోని కాల్పుల ఘటనలో నిందితుడిగా చెబుతున్న మనోజ్ నాయుడు తాను కాదని, తాను బెంగళూరులో ఉంటే ఈ విషయం తెలిసిందని ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

అయితే అసలు నిందితుడిగా చెబుతున్న మనోజ్ నాయుడు అలియాస్ సూర్యతేజ... "శంబో శివ శంభో" సినిమాలో రవితేజ - నరేష్ లకు స్నేహితుడిగా నటించిన వ్యక్తి అని తెలుస్తుందని అంటున్నారు!!

Tags:    

Similar News