శంభాజీ చరిత్రను స్కూల్లో ఎందుకు చెప్పలేదు? సూటి ప్రశ్న!

ఒక గొప్ప వీరుడి గురించి.. అతడి త్యాగం గురించి సినిమా చూసి మాత్రమే తెలుసుకోవాలా? చరిత్ర పాఠాల్లో ఎందుకు ఉండదు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Update: 2025-02-18 09:30 GMT

ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా ఒక ప్రశ్నను సూటిగా.. సుత్తి లేకుండా సంధిస్తున్నారు. అదే.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ గురించి స్కూల్లోని చరిత్ర పుస్తకాల్లో ఎందుకు లేదు? అతడి త్యాగాన్ని పాఠాలుగా ఎందుకు చెప్పట్లేదు? తాజాగా అతడి జీవిత చరిత్రను ‘ఛావా’ పేరుతో మూవీ రిలీజ్ కావటంతో చరిత్ర అంశాలు ఇప్పుడు చర్చకు తెర తీశాయి. విక్కీ కౌశల్ ప్రధానపాత్రను పోషించిన ఈ మూవీ చూసిన ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు అడిగే ప్రశ్న ఒక్కటే. ఇంతటి యోధుడు.. వీరుడి జీవిత చరిత్రను స్కూల్లో పిల్లలకు చెప్పే చరిత్ర పాఠాల్లో ఎందుకు లేదని?

ఒక గొప్ప వీరుడి గురించి.. అతడి త్యాగం గురించి సినిమా చూసి మాత్రమే తెలుసుకోవాలా? చరిత్ర పాఠాల్లో ఎందుకు ఉండదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీశ్ ఈ ప్రశ్నను అడిగాడు. అప్పటికే ఈ ప్రశ్నను సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు. పలువురు ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నను తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంధించారు. తాజాగా ఆయన పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. సినిమా చూసి ధియేటర్ నుంచి బయటకు వచ్చే వేళలో ప్రేక్షకులు ఒకలాంటి గంభీరత్వంతో వస్తున్నారు. ఈ సినిమాను అద్భుతంగా ఉందన్న ఆకాశ్ చోప్రా.. కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఈ రోజే ఛావా సినిమాను చూశాను. ధైర్యం.. నిస్వార్థం.. తన పనిపై అంకితభావం.. ఇలా ఎన్నో విషయాలు కలిసిన గొప్ప కథ. నిజాయితీగా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. మనకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి పాఠశాలలో ఎందుకు నేర్పించలేదు?’’ అని ప్రశ్నించారు.

ఆయన గురించి పుస్తకాల్లో ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు? కానీ.. అక్బర్ గొప్ప నాయకుడని.. న్యాయంగా పాలించిన చక్రవర్తి అని నేర్పించారు. అంతేకాదు.. ఢిల్లీలో ఒక పెద్ద రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టారు. అలా ఎందుకు చేశారు? అని తన పోస్టులో ప్రశ్నించారు. ఆయన పోస్టుకు పలువురు స్పందించారు. చరిత్రను నేర్చుకోలేదా? అని ఒకరు ప్రశ్నించగా.. తాను టాపర్ నని.. చరిత్రలో తనకు 80 శాతం మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. పలువురు ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నలను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం దీన్ని వివాదాస్పదం చేయొద్దని వ్యాఖ్యానించటం గమనార్హం. అయితే.. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న మాత్రం ఒకటి ఉంది. అదే.. శంభాజీ జీవిత చరిత్రను చరిత్ర పాఠాల్లో ఎందుకు లేదు? దీనికి ఎవరు బాధ్యులు అని.

Tags:    

Similar News