6500 కోట్ల ఆస్తులున్న హీరోకి ఛాన్సిస్తానన్న గాయకుడు!
వెటరన్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వైఖరి గురించి తెలిసిందే. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం సహా అగ్ర కథానాయకులందరికీ చార్ట్ బస్టర్ పాటలు అందించిన ఘనుడు.
వెటరన్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వైఖరి గురించి తెలిసిందే. బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం సహా అగ్ర కథానాయకులందరికీ చార్ట్ బస్టర్ పాటలు అందించిన ఘనుడు. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారూఖ్ కి అతడు ఆత్మలా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. షారూఖ్ కి చార్ట్ బస్టర్ క్లాసిక్స్ ని పాడినా కానీ అతడు తనకు తగినంత గుర్తింపు దక్కలేదని భావించాడు. దానివల్ల ఖాన్ తో ఘర్షణ పడ్డాడు.
అతడు షారూఖ్ ని పెద్ద సూపర్ స్టార్ అని గౌరవించినా కానీ, తమ మధ్య చాలా విషయాలు అపరిష్కృతంగా ఉండటానికి కారణం.. ఎవరూ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయకపోవడమేనని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కొన్నేళ్లుగా ఆ ఇద్దరి నడుమా ఎడం అలానే ఉండిపోయింది. ఖాన్ సినిమాలకు అభిజీత్ పాడలేదు. అయినా షారూఖ్- అభిజీత్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ పాటల వీరాభిమానులు తిరిగి వారు కలవాలని కూడా కోరుకుంటున్నారు.
అదే క్రమంలో తాను షారూఖ్ కోసం పాడేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనే సందిగ్ధత అలానే ఉంది. తాజా ఇంటర్వ్యూలో మీరు SRK కోసం మళ్లీ పాడతారా? అని ప్రశ్నించగా... తనకు సొంతంగా నిర్మాణ సంస్థ ఉందని, తానే షారూఖ్ కి పాడేందుకు ఛాన్సిస్తానని వ్యాఖ్యానించినట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది. దీనిని బట్టి అభిజీత్ ఇకపై నేపథ్య గాయకుడిగా కొనసాగే అవకాశం లేదని, నిర్మాతగా ఎదిగే ప్లాన్ లో ఉన్నాడని అభిమానులు భావిస్తున్నారు.
వో లడ్కీ జో సబ్సే అలాగ్ హై, బాద్షా, చాంద్ తారే, యెస్ బాస్, చల్తే చల్తే సహా ఎన్నో హిట్ పాటలకు అభిజీత్ పాడారు. ఇవన్నీ షారూఖ్ కెరీర్ లో మర్చిపోలేని చార్ట్ బస్టర్ సాంగ్స్. పాటలకు క్రెడిట్ విషయంలో అభిజీత్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ గొడవల కారణంగానే అతడు షారూఖ్ కి దూరమయ్యాడు. ఆసక్తికరంగా 6500 కోట్ల నికర ఆస్తులతో దేశంలోనే అత్యధిక ధనవంతుడైన కథానాయకుడిగా షారూఖ్ కి పేరుంది. అంత పెద్ద స్టార్ కి అవకాశం ఇచ్చే స్థాయికి గాయకుడు అభిజీత్ సంపాదించాడని కూడా గ్రహించాలి.