తెరవెనక నిపుణులకు గుర్తింపు కావాలని గాయకుడి ఆవేదన!
స్వరకర్త లేదా గాయకుడి మధ్య పోరాటం .. అలాగే ఆ పాటలో నటించిన తారలకు కూడా హక్కులు ఉంటాయా? అన్న వాదన కూడా సాగింది.
సంగీతం సాహిత్యం గానంలో సృజనాత్మకతపై హక్కులు ఎవరికి కట్టబెట్టాలి? అవి సృష్టించిన వారికి లేదా వాటిని డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన లేదా తయారీకి సహకరించిన నిర్మాతలకు...! ఈ విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నిర్మాత సర్వహక్కులను కలిగి ఉంటాడు. క్రియేటర్ల సృజనాత్మకతను నిర్మాత డబ్బు పెట్టి కొనుగోలు చేసాడు కదా! అన్న పాయింట్ చర్చగా మారింది. అయితే తాము పాడిన పాటలు సృజించిన మ్యూజిక్ విషయంలో తమకు మాత్రమే హక్కులు ఉంటాయని, సినిమా రిలీజై ఆడి వెళ్లాక కూడా రాయల్టీ ఇవ్వాలని పోరాటం సాగించారు మ్యాస్ట్రో ఇళయరాజా.. ఏ.ఆర్.రెహమాన్ సహా పలువురు సంగీత దిగ్గజాలు. స్వరమాంత్రికుడు ఇళయరాజా చాలాసార్లు తన పోరాటంలో పైచేయి సాధించడం చర్చనీయాంశమైంది.
స్వరకర్త లేదా గాయకుడి మధ్య పోరాటం .. అలాగే ఆ పాటలో నటించిన తారలకు కూడా హక్కులు ఉంటాయా? అన్న వాదన కూడా సాగింది. ఇటీవల డ్యువా లిపా ముంబై కచేరీలో ఆమె సూపర్‌హిట్ ట్రాక్ లెవిటేటింగ్ అలాగే బాజీగర్ పాట `వో లడ్కీ జో` మాషప్ ని ప్రదర్శించగా అవి సంచలనంగా మారాయి. షారూఖ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది ఈ మాషప్. ఈ సందర్భంలో కింగ్ ఖాన్ షారూఖ్ పేరును డ్యువా లిపా ప్రస్థావించడంతో ఆడిటోరియం మార్మోగింది. ఖాన్ అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది.
అయితే ఈ పాటను ప్లే చేసినప్పటికీ ఆ పాటకు కర్త కర్మ క్రియ అయిన తన తండ్రి గారిని, ఇతర టెక్నీషియన్లను విస్మరించడం గాయకుడు అభిజీత్ కుమారుడికి నచ్చలేదు. అభిజీత్ భట్టాచార్య కుమారుడు తన తండ్రి సహకారాన్ని విస్మరించడంపై విరుచుకుపడ్డారు. తెర ముందు షారూఖ్ ఆడినా కానీ, తెర వెనక లిరిసిస్ట్ గాయకుడు స్వరకర్త ఉన్నారు కదా? దీనిని మరిచారనేది అతడి వాదన. నిజానికి ఇలాంటి పాటల్ని అజరామరంగా మలచడంలో కేవలం తెర ముందు కనిపించే నటుడి పాత్ర మాత్రమే కాదు... తెరవెనక టెక్నీషియన్ల పాత్రను విస్మరించకూడదు.
బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ పాటలకు షారూఖ్- అభిజీత్ కలిసి పని చేసారు. ఆల్ టైమ్ క్లాసిక్స్ తో వారు అలరించారు. ఈ జోడీకి ఉన్న గుర్తింపు విశ్వవిఖ్యాతమైంది. అందుకే ఇప్పుడు అభిజీత్ కుమారుడు తన తండ్రికి గుర్తింపు రాకపోవడంపై సీరియస్ గా ఉన్నారు. కనీసం ఇకపై అయినా తెరపై కనిపించే స్టార్ కి మాత్రమే కాదు.. తెరవెనక పని చేసే రైటర్లు, ఇతర టెక్నీషియన్లకు తగినంత గుర్తింపు, రాయల్టీ వచ్చేట్టు చట్టాలను సవరిస్తే అది వివాదాలను తగ్గిస్తుందని విశ్లేషిస్తున్నారు.
అభిజీత్ ఏమన్నారు?
1999 నాటి `అత్యుత్తమమైన పాట .. బాద్ షా పాట` అని పేర్కొంటూ డ్యువా లిపా తన ప్రదర్శన సమయంలో వ్యాఖ్యానించారు. అయితే ఇది గాయకుడు అభిజీత్ కి నచ్చలేదు. పాట వెనుక ఉన్న బృందాన్ని కూడా గుర్తు చేయాల్సిందని అభిజీత్ వాదించారు. ``ఇది అతని (స్వరకర్త అను మాలిక్) జీవితంలో గొప్ప పాట. డ్యువా లిపా దానిని చెప్పాలి. ఆమె పాటల సృష్టికర్త కదా? అను మాలిక్, జావేద్ అక్తర్, నేను ఈ పాటను రూపొందించాము`` అని అన్నారు.
డ్యువా లిపా ఎవరో తాను పట్టించుకోను.. కానీ ఈ పాట ఆమె కంటే ముందే `జనాదరణ పొందింది` అని అభిజీత్ వాదించారు. ``చాలా స్పష్టంగా చెప్పాలంటే, డ్యువా లిపా ఎవరో నేను పట్టించుకోను. ఆమె నా పేరు చెబుతుంది లేదా చెప్పదు.. కానీ ఆమె దానిని వేదికపై ప్రదర్శించినప్పుడు... ప్రజలు విన్నారు.. ఆస్వాధించారు అని అన్నారు. అయితే దీనికి ముందు సృష్టికర్తలు వేరే ఉన్నారని కూడా ఆమె గుర్తు చేయాల్సింది అని అభిప్రాయపడ్డారు.