ఆమెనే కాదు.. అజయ్ కూడా ఫుల్ ట్రెండింగ్!

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Update: 2024-10-20 19:30 GMT

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరాకు సీక్వెల్ గా రూపొంది సినీ ప్రియులను అలరించింది. కడుపుబ్బా నవ్వించింది. రితేష్ రాణా తెరకెక్కించిన ఆ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించారు.

టీజర్, ట్రైలర్ తోనే మంచి అంచనాలు నెలకొల్పిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. ముఖ్యంగా సినిమాలో సత్య కామెడీ అదిరిపోయిందని, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అట్రాక్ట్ చేసిందని రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మత్తువదలరా-2 భారీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

అయితే ఓటీటీలోకి వచ్చాక.. సినిమా లోని ఓ సీన్‌ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ గా మారిన విషయం తెలిసిందే. అదే 'రియా ఎవరు?' సీన్. ఆ మాటను సినిమాలో సత్య అడుగుతారు. దానికి అజయ్‌ మామూలుగానే ఆన్సర్‌ ఇస్తారు. కానీ దర్శకుడు ఆ సీన్‌ ను సూపర్ గా రాశారు. దానిని సత్య అండ్‌ కో బాగా పండించారు. దీంతో ఆ సీన్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను రీల్స్‌ గా కూడా సెలబ్రిటీలు చేసేస్తున్నారు.

మొత్తానికి రియా పాత్రలో నటించిన ముంబై బ్యూటీ ఇషా యాదవ్.. కొద్ది రోజులుగా నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. అదే సమయంలో నటుడు అజయ్ కూడా ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఆ విషయంపై ఆయన మాట్లాడారు. పొట్టేల్ మూవీ ప్రమోషన్స్ లో స్పందించారు. తాను ఇంటర్నెట్‌ లో కొద్ది రోజులుగా ట్రెండింగ్ లో ఉన్నానని అన్నారు. ఇంకొన్ని రోజులు కూడా ఉన్నట్లు కనిపిస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఆ సీన్ బాగా పాపులర్ అయిందని అన్నారు.

అయితే మత్తు వదలరా-2తో అలరించిన అజయ్.. ఇప్పుడు అనన్య నాగళ్ల, చంద్రకృష్ణ హీరోహీరోయిన్లుగా వస్తున్న పొట్టేల్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. విక్ర‌మార్కుడు త‌ర్వాత మరోసారి పొట్టేల్ లో విల‌న్‌ గా సినీప్రియులను ఆక‌ట్టుకోవాల‌ని చూస్తున్నారు. తన క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉన్నాయని ఇటీవల తెలిపారు. చాలా రోజుల తర్వాత తనకు నచ్చిన రోల్ దొరికిందని చెప్పారు. యాక్టర్‌ గా హ్యాపీనెస్ ఇచ్చిన రోల్ అదని పేర్కొన్నారు. మరి ఆ మూవీతో అజయ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News