దిల్లీ స్థాయిలో `పద్మ` అవార్డ్ కోసం ట్రై చేసా: సీనియర్ నరేష్
తెలుగు చిత్రసీమలో పద్మ పురస్కారాలకు అర్హమైన ప్రతిభావంతులు ఎందరో ఉన్నారని గుర్తు చేసారు.
రాజకీయాలు తగ్గి, అర్హులైన కళాకారులకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని ఆకాంక్షించారు నటుడు సీనియర్ నరేష్. అవార్డుల్ని అర్హులైన వారికే ఇస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా ఉందని కూడా అన్నారు. తెలుగు చిత్రసీమలో పద్మ పురస్కారాలకు అర్హమైన ప్రతిభావంతులు ఎందరో ఉన్నారని గుర్తు చేసారు. తన తల్లి గారైన విజయనిర్మల 46 సినిమాలకు దర్శకత్వం వహించడమే గాక, తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి దశాబ్ధాలుగా ఎంతగానో సహాయసహకారాలు అందించారని, అమ్మకు పద్మ పురస్కారం దక్కకపోవడం నిరాశపరిచిందని అన్నారు. దిల్లీ స్థాయిలో ప్రయత్నించినా కానీ పద్మ పురస్కారాన్ని ప్రకటించలేదని అన్నారు.
భాజపా ప్రభుత్వం వచ్చాక తెలుగు పరిశ్రమలో స్థాయి ఉన్న వారికి పురస్కారాలు దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. అమ్మ విజయనిర్మలకు `పద్మ` పురస్కారం కోసం మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రికమండ్ చేసారని అయినా అవార్డ్ రాలేదని తెలిపారు. అర్హులైన వారికి పద్మ పురస్కారం దక్కేందుకు తాను ఆమరణ నిరాహార ధీక్ష చేసినా తప్పు లేదని అన్నారు. అవార్డుల విషయంలో తాను ఏ ప్రభుత్వాన్ని విమర్శించబోవడం లేదని కూడా అన్నారు.
గతంలో లెజెండరీ నటుడు ఎంజీఆర్ మరణించాక కానీ పద్మ పురస్కారం ఇవ్వలేదు. అన్నగారు, సీనియర్ ఎన్టీఆర్ మరణించాకే పద్మ పురస్కారం దక్కిన విషయాన్ని గుర్తు చేసారు. మూడు దశాబ్ధాలుగా సీనియర్ నరేష్ తెలుగు చిత్రసీమలో నటుడిగా కొనసాగుతున్నారు. హీరోగా, సహాయనటుడిగా, నిర్మాతగా ఆయన కెరీర్ నావ సాగింది. నటి - దర్శకురాలు అయిన విజయ నిర్మల కుమారుడిగా సినీరంగంలో ప్రవేశించినా కానీ, తనదైన ప్రతిభతో ఆయన రాణించారు.