కంటెంటే కింగ్.. కొత్త కథ చెప్పు, క్రేజీ ఆఫర్ పట్టు!
ఇందులో భాగంగా నవతరం ఆలోచనలతో వచ్చే కొత్త దర్శకులకు, ఒకటీ రెండు సినిమాల అనుభవమున్న యంగ్ డైరెక్టర్స్ కు కూడా అవకాశాలు అందిస్తున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ హీరోల ఆలోచనలన్నీ కొత్తదనం చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేక్షకులు కొత్త కంటెంట్ కోరుకోవడంతో, అంతా ఆ వైపుగా పరుగులు తీస్తున్నారు. కొత్త కథలను తెర మీదకు తీసుకురావడానికి, తమని తాము సరికొత్త పాత్రల్లో ఆవిష్కరించుకోడానికి, ఇంకాస్త కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నవతరం ఆలోచనలతో వచ్చే కొత్త దర్శకులకు, ఒకటీ రెండు సినిమాల అనుభవమున్న యంగ్ డైరెక్టర్స్ కు కూడా అవకాశాలు అందిస్తున్నారు.
'భోళా శంకర్' తో భంగపడ్డ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఫ్యాన్ బాయ్స్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో హీరో నాని సమర్పణలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. 'దసరా'తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్.. రెండో మూవీ సెట్స్ మీద వుండగానే ఇప్పుడు చిరుతో సినిమా ఓకే చేయించుకోవడం విశేషం. ఇది బాస్ కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్పబడుతోంది.
సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకునే కింగ్ అక్కినేని నాగార్జున.. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి విజయ్ బెన్నీ వరకూ అనేక మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు ఆయన మరో ఇద్దరు యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'హుషారు', 'ఓం భీమ్ బుష్' సినిమాలు తీసిన హర్ష కొనుగంటితో నాగ్ ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. అలానే నవీన్ అనే తమిళ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వీటిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత విక్టరీ వెంకటేశ్ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణతో వెంకీ ఓ మూవీ చేస్తారని గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. కథా చర్చలు పూర్తయ్యాయని, సంక్రాంతి తర్వాత ఈ ప్రాజెక్టును ప్రకటిస్తారని అనుకుంటున్నారు. 'హాయ్ నాన్న'తో దర్శకుడిగా పరిచయమైన శౌర్యువ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. స్టోరీ లైన్ కు తారక్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, దర్శకుడు స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడని టాక్.
RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తన తర్వాతి చిత్రాన్ని బుచ్చిబాబు సానా చేతుల్లో పెట్టారు. 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా మాత్రమే. ఆయన చెప్పిన కథ నచ్చడంతో చెర్రీ వెంటనే పచ్చజెండా ఊపారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది. ఇక మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో మైలురాయి 75వ సినిమా బాధ్యతను డెబ్యూ డైరెక్టర్ కు అప్పగించారు. 'మాస్ జాతర' అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇలా టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని కాంబినేషన్స్ కుదురుతున్నాయి. 'కంటెంటే కింగ్' అని నమ్మిన స్టార్ హీరోలు.. చిన్నా పెద్దా అని తేడాలు చూడకుండా కొత్తవారికి అవకాశాలు అందిస్తున్నారు. వైవిధ్యమైన బలమైన కథతో వస్తే చాలు, దర్శకుల అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకుండా ముందుకు సాగుతున్నారు. మరి వీరిలో ఎవరెవరు అగ్ర హీరోల నమ్మకాన్ని నెలబెట్టుకుని, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారో చూడాలి.