12 రోజుల పాటు ఆమెకు రిమాండ్!
అనంతరం కస్తూరి హైదరాబాద్ లో సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఆమెను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా నటి కస్తూరి శంకర్ తెలుగు వారి గురించి చేసిన వ్యాఖ్యలు ఎటువంటి దుమారం లేపాయో అందరికీ తెలుసు. హిందూ మక్కల్ కట్చి తరఫున జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి మాట్లాడుతూ తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.తెలుగు జాతిని అవమానించేలా ఉన్న ఆమె మాటలకు తెలుగు ప్రజలు హర్ట్ కావడంతో చెన్నై, మదురై తదితర నగరాల్లో ఆమె పై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు.
అఖిల భారత తెలుగు సమ్మేళనం తరఫున కస్తూరి పై ఎగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం కస్తూరి ఇంటికి వెళ్ళారు. అయితే అప్పటికే అనుకోకుండా తనపై తీవ్రంగా వ్యక్తమైన నిరసనలతో భయపడిన కస్తూరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఇంటికి తాళం పెట్టి పరారీలో ఉంది. దీంతోపాటుగా ఆమె ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసిన పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. అందుకే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అని అందరు భావించారు.
అనంతరం కస్తూరి హైదరాబాద్ లో సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు శనివారం రాత్రి ఆమెను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టు ముందు కస్తూరి తాను ఎక్కడికి పోలేదు అంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేశారు. తనకు భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు అని పేర్కొన్న కస్తూరి, తన ఫోన్ లాయర్ దగ్గర ఉందని అన్నారు. షూటింగ్ నిమిత్తం వచ్చిన ఆమె హైదరాబాదులోని తన సొంత ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఆమె మాట్లాడిన మాటలను వక్రీకరించి.. అనవసరంగా కేసు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర అని పేర్కొన్న కస్తూరి.. త్వరలోనే నిజం బయటికి వస్తుందని అన్నారు.
నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేసిన కస్తూరిని చెన్నై,ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన మేజిస్ట్రేట్ నవంబర్ 29 వరకు 12 రోజుల పాటు ఆమెను రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించారు. దీంతో ప్రస్తుతం కస్తూరిని చెన్నైలోని పుఝల్ జైలులో ఉంచారు. కస్తూరి తెలుగు వారిపై అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేసాయి. అయితే దీనిపై తమిళనాట రాజకీయాలలో ఎటువంటి దుమారం వేగుతుందో చూడాలి.