సాఫ్ట్‌వేర్ - కంప్యూట‌ర్ నాలెజ్‌ చాలు.. AIలో సినిమా తీసేయొచ్చు!

అధునాత ప్ర‌పంచంలో సాంకేతిక‌త రోజు రోజుకు మారుతోంది.

Update: 2024-05-12 13:18 GMT

సాఫ్ట్‌వేర్ - కంప్యూట‌ర్ విజ్ఞానం ఉంటే స‌రిపోతుందా? AIలో సినిమాలు తీసేయొచ్చా? ఇక హీరోలు న‌టీన‌టుల‌తో ప‌ని లేకుండా కేవ‌లం కొంద‌రు సాఫ్ట్ వేర్ టెక్నీషియ‌న్లు ఇంట్లో కూచుని సినిమాలు తీసేయొచ్చా? ఏఐతో ఇది సాధ్యం కాబోతోందా? అంటే అవున‌నే అంటున్నారు. ఇది వినోద ప్ర‌పంచంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించే వార్త‌. వివ‌రాల్లోకి వెళితే....

అధునాత ప్ర‌పంచంలో సాంకేతిక‌త రోజు రోజుకు మారుతోంది. ఇప్పుడు AI ట్రెండ్ న‌డుస్తోంది. ఏఐ సాంకేతిక‌త అన్ని రంగాల్లోను ప్ర‌భావం చూపుతోంది. భవిష్య‌త్ కృత్రిమ మేధ‌(AI) దేనంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. వినోద‌రంగంలోను దీని ప్ర‌భావం గ‌ణ‌నీయంగా ఉంటుంద‌ని అంచ‌నా. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఏఐలో పూర్తి స్థాయి ఫీచ‌ర్ సినిమాలు తెర‌కెక్కే రోజులు ఇంకెంతో దూరంలో లేవు. వీటిని తెర‌కెక్కించేందుకు హీరోలు, న‌టీన‌టుల‌తో ప‌ని లేదు. కేవ‌లం సాంకేతిక ప‌రిజ్ఞానంతోనే సినిమా తీసేయ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఏదైనా సినిమాలో మ‌ట్టి మ‌నుషుల‌ను సృష్టించాల‌న్నా.. లేదా ఒక ట‌వ‌ర్ లాంటి బామ్మ‌నో లేక సూప‌ర్ ఉమెన్ నో క్రియేట్ చేయాల‌న్నా ఏఐతో ప‌నైపోతుంది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో జ‌రుగుతున్న 2024 AI ఫిల్మ్ ఫెస్టివల్ లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

AI- పవర్డ్ వీడియో జనరేషన్ రంగంలో అగ్రగామి స్టార్టప్‌లలో ఒకటైన రన్‌వే సంస్థ న్యూయార్క్ లో `AI ఫిలిం ఫెస్టివల్ -2024`ని నిర్వ‌హించ‌గా దాదాపు 3000 షార్ట్ ఫిల్మ్‌లు ప్ర‌ద‌ర్శ‌న‌కు వ‌చ్చాయి. ఎంపిక చేసిన 10 చలనచిత్రాలను ఇక్క‌డ‌ ప్ర‌ద‌ర్శించారు. ఈ ల‌ఘు చిత్రాలు జూరీ ప్యానెల్ ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. వీటి కోసం ఎంపిక చేసుకున్న‌ కథలు, సౌందర్యపరంగా అద్భుతమైన యూనివ‌ర్శ్ లలో క‌థ‌ల్ని చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది.

ఇన్సెప్ష‌న్ , మ్యాట్రిక్స్, ల‌వింగ్ విన్సెంట్ వంటి సినిమాల‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించిన ఏఐ సినిమాలు గుర్తు చేసాయ‌ని కితాబు అందింది. రన్‌వే సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనస్టాసిస్ జెర్మానిడిస్ హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ, ``... AI-లో ఫిల్మ్‌మేకింగ్ క్రియేషన్ చాలా నిర్దిష్టమైన శైలిని కలిగి ఉన్నట్లు ఒక అభిప్రాయం ఉంది. అయితే ఈ ఫెస్టివ‌ల్ లో ఎంపిక చేసిన ప్రతి చిత్రం ఇత‌ర చిత్రం కంటే చాలా భిన్నంగా ఉన్నాయి`` అని అవార్డుల వేడుకలో అన్నారు. గత 50 సంవత్సరాలలో చలనచిత్ర నిర్మాణం .. యానిమేషన్ విపరీతంగా అభివృద్ధి చెందాయి. AI లఘు చిత్రాలను చూస్తున్నప్పుడు ఇన్‌సెప్షన్, ది మ్యాట్రిక్స్, లవింగ్ విన్సెంట్ వంటి సినిమాలు గుర్తుకు వచ్చాయి అని అన్నారు. తాజా సాంకేతికత సాధారణ చలనచిత్ర బడ్జెట్‌లో కొంత భాగం ఖ‌ర్చుతోనే... కంప్యూటర్ - సాఫ్ట్‌వేర్ విజ్ఞానం ఉన్న వారికి గొప్ప సినిమాల‌ను తీసే అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని అన్నారు.

కేవలం ప్రాంప్ట్‌తో రన్‌వే స్టిల్ చిత్రాల శ్రేణిని చిన్న వీడియోగా మార్చగలదు లేదా ఫోటోను పెయింటింగ్‌గా మార్చగలదు. గ‌త ఫిబ్రవరిలో, జెనరేటివ్ AI లీడర్ ఓపెన్ ఏఐ తన వీడియో క్రియేషన్ సాఫ్ట్‌వేర్ కు `సోరా` అని పేరు పెట్టింది. అయితే గూగుల్ .. మెటా వరుసగా లూమియర్ - ఈము అని పిలుచుకునే వారి స్వంత వెర్షన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.

న్యూయార్క్ లో జ‌రిగిన ఏఐ ఫిలిం ఫెస్టివల్‌లో హానర‌రీ బహుమతిని గెలుచుకున్న లియో కానోన్ AI అప్లికేషన్ మిడ్‌జర్నీని ఉపయోగించి వందలాది చిత్రాలను రూపొందించాడు. ఆపై వాటిని రన్‌వేతో యానిమేట్ చేశాడు..అలాగే లెక్కలేనన్ని సవరణలు (క‌రెక్ష‌న్స్‌)చేశాడు.

ప్రస్తుత AI సాంకేతికత ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందలేదు.. ప్రత్యేకించి బహుళ కెమెరా కోణాలను అందించడంలో దోషరహితంగా మానవుడు మాట్లాడే విధంగా పాత్రలను రూపొందించడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. AI రూపొందించిన విజువల్స్‌తో ప్రతి సన్నివేశంలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి, కాబట్టి నేను చాలా రీటచ్ చేయాల్సి వచ్చిందని ఒక అనుభ‌వ‌శాలి తెలిపాడు.

Tags:    

Similar News