రేటు పెంచేసిన ఐశ్వర్యా రాజేష్
కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనని తాను నిలదొక్కుకుంది. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు ఛాన్సులివ్వరని, ఇచ్చినా నిర్మాతలు చాలా కండిషన్స్ పెడతారని అంటుంటారు
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరో రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన ఐశ్వర్యా రాజేష్ పేరుకే తెలుగమ్మాయి కానీ అమ్మడు ఎక్కువ తమిళ సినిమాలే చేస్తుంటుంది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనని తాను నిలదొక్కుకుంది. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు ఛాన్సులివ్వరని, ఇచ్చినా నిర్మాతలు చాలా కండిషన్స్ పెడతారని అంటుంటారు.
అందుకే ఐశ్వర్య కోలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటూ సెటిలైంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఐశ్వర్యా రాజేష్ తన తండ్రి లెగసీని తెలుగులో కంటిన్యూ చేయాలనుకుంది కానీ అనుకున్న విధంగా ఆమెకు అవకాశాలు దక్కక కోలీవుడ్ కు వెళ్లి అక్కడ కెరీర్ ను స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన టాలెంట్ తో దాదాపు 50 సినిమాల్లో నటించిన ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత టక్ జగదీష్ లో నానికి మరదలిగా కూడా నటించింది.
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలో కూడా మెరిసిన ఐశ్వర్యా రాజేష్ కు ఆ సినిమాలేవీ సాలిడ్ సక్సెస్ ను ఇవ్వకపోగా ఎవరికీ గుర్తు కూడా లేవు. అమ్మడు తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తానే కొట్టాయి. కానీ రీసెంట్ గా ఐశ్వర్య నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రతో అందరినీ మెప్పించిన ఐశ్వర్యా రాజేష్ కు ఈ సినిమా హిట్ తర్వాత ఛాన్సులు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అవకాశాలొచ్చాయని ప్రతీ సినిమానూ ఓకే చేయకుండా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. కథ బావుండటంతో పాటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని, అప్పుడే సినిమాను ఓకే చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. దానికి తోడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్యా తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్టు సమాచారం. ఇంతకు ముందు సినిమాకు కోటి రూపాయిలు తీసుకునే అమ్మడు ఈ సినిమా తర్వాత రూ.3 కోట్లు నుంచి రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.