వాళ్లలా ఆ స్టార్ హీరో ఎందుకు చేయలేకపోతున్నాడు?
కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ, ధనుష్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతున్నాయంటే? ప్రచారం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.;

కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ, ధనుష్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతున్నాయంటే? ప్రచారం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. వాళ్లంతా హైదరాబాద్ కి వచ్చి ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తారు. ఓ పది రోజుల పాటు సిటీలో తిష్ట వేసి వీలైనన్ని ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. పర్సనల్ ఇంటర్వ్యూలు సైతం ఇస్తుంటారు. ఆ ముగ్గురు తెలుగు ఆడియన్స్ కు రీచ్ అయ్యారంటే కేవలం సక్సెస్ తో మాత్రమే దరి చేరలేదు.
ఇక్కడ ఆడియన్స్ తో వాళ్లు ఇంటరాక్ట్ అయిన విధానం నచ్చడం సహా సక్సెస్ లు ఆ స్థానంలో కూర్చో బెట్టాయన్నది వాస్తవం. తల అజిత్ కుమార్ కూడా ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ తో అలాగే ఉండేవారు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే? హైదరాబాద్ కి వచ్చి ప్రచారం చేసి వెళ్లేవారు. అయితే చాలా కాలంగా ఆయన తమిళ సినిమాలు తెలుగు లో రిలీజ్ అవ్వడం తప్ప ఇక్కడ పెద్దగా ప్రచారానికి నోచుకోవడం లేదనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తుంది.
తాజాగా మరోసారి అదే అంశం తెరపైకి వస్తోంది. అజిత్ హీరోగా నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఏప్రిల్ 10న పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఆ రేంజ్ లో రిలీజ్ అవుతుందంటే తెలుగింట ప్రచారం పీక్స్ లో జరగాలి. మరి అలా జరుగుతుందా? అంటే ఎక్కడా ఆ ఛాన్సే కనిపించడం లేదు. ఈ సినిమా ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఎక్కడా కనిపించడం లేదు. రిలీజ్ కి ఇంకా వారం రోజులే సమయం ఉంది.
ఎంత చేసినా ఈ గ్యాప్ లోనే పూర్తి చేయాలి. ఇప్పటికే తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చైసారు. అటుపై మళ్లీ హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే తమిళంలో లాంచ్ చేసిన రెండు పాటలు ఇంకా తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ కూడా చేయలేదు. దీంతో `గుడ్ బ్యాడ్ అగ్లీ` ప్రచారం ఎంత వీక్ గా తేట తెల్లమవుతుంది. ఇప్పటికైనా మైకర్స్ పూనుకుని ముందుకొస్తే జరిగిన నష్టాన్ని భర్తీ చేసే అవకాశం కొంతైనా ఉంటుంది.