పావలా శ్యామలను ఆదుకున్న ఆకాష్ పూరి
తెలుగు సినిమా సుదీర్ఘ చరిత్రలో వందల చిత్రాల్లో నటించిన సహాయనటి పావలా శ్యామల వయసు పైబడిన సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు.
తెలుగు సినిమా సుదీర్ఘ చరిత్రలో వందల చిత్రాల్లో నటించిన సహాయనటి పావలా శ్యామల వయసు పైబడిన సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు. నటిగా అవకాశాల్లేవ్. అవకాశాలిచ్చినా సత్తువ లేదు. పోషణ భారమైంది. ఇలాంటి పరిస్థితిలో తనను ఆదుకునేందుకు గతంలో కొందరు హీరోలు ఆర్థిక విరాళాల్ని అందించారు. మెగా కుటుంబ హీరోలు పలుమార్లు పావలా శ్యామలను ఆదుకున్నారు. ఇటీవల తాను కష్టాల్లో ఉన్నానని ఆవేదన చెందుతూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు పావలా శ్యామల. పరిశ్రమ పెద్దలు తనను ఆదుకోవాలని అర్థించారు.
పావలా శ్యామలా ధీన స్థితి గురించి తెలుసుకున్న యువ హీరో ఆకాశ్ పూరీ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష క్యాష్ ని అందించి ఎలాంటి సాయం అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఆకాష్ స్వయంగా శ్యామల ఉంటున్న సీనియర్ సిటిజెన్స్ గృహానికి వెళ్లి అక్కడ చెక్‌ను అందించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
నేను గొప్ప నటిని అని అనుకోవడం లేదు. నాన్న(పూరి)గారు రాసిన డైలాగులు నన్ను గొప్పగా చూపించాయని అనుకుంటున్నాను! అంటూ పావలా శ్యామల ఆకాష్ తండ్రి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని ప్రశంసించారు. పూరిలోని గొప్ప డైలాగ్ రైటర్ ని పావలా శ్యామల ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. పూరి తెరకెక్కించిన పలు చిత్రాల్లో పావలా శ్యామల డైలాగులు చాలా పాపులరయ్యాయి.