అఖండ 2 : రవి వర్మపై నమ్మకంతో..!
యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం 'అఖండ 2' సినిమాను రూపొందిస్తున్నాడు.;

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం 'అఖండ 2' సినిమాను రూపొందిస్తున్నాడు. సింహా, లెజెండ్, అఖండ సినిమాల తర్వాత బాలకృష్ణతో బోయపాటి రూపొందిస్తున్న నాల్గవ సినిమా ఇది అనే విషయం తెల్సిందే. అఖండ 2 సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ 2 సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చాలా స్పెషల్‌గా ఉంటాయని తెలుస్తోంది. హీరోగా బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సమయంలో అఖండ 2 ఆయనకు ఐదో విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా ఇది. నందమూరి ఫ్యాన్స్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ 2 సినిమాలో సనాతన ధర్మం గురించి ప్రముఖంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలోని యాక్షన్ సన్నివేశాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శకుడు బోయపాటి ది బెస్ట్ యాక్షన్ మూవీగా అఖండ 2 ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగబోతుంది. సినిమాలోని కీలకమైన ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాల బాధ్యతను స్టంట్స్ కొరియోగ్రాఫర్ రవి వర్మపై ఉంచాడని తెలుస్తోంది.
సాధారణంగా బోయపాటి సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కొన్ని సినిమాల్లో కాస్త శృతి మించినప్పటికీ, ఎక్కువ శాతం ఆయన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులు అభిమానిస్తూ ఉంటారు. అందుకే సినిమా సినిమాకు తన యాక్షన్ సన్నివేశాలను మరింతగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి అఖండ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను టాలీవుడ్‌లోనే ది బెస్ట్‌గా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం రవి వర్మ వంటి ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్‌ను ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. గతంలో పలు తెలుగు సినిమాలకు ఆయన వర్క్ చేసి మంచి మార్కులు దక్కించుకున్నాడు.
బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల్లో నటించి వరుస విజయాలను దక్కించుకున్నారు. కమర్షియల్‌గా డాకు మహారాజ్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయినా బాలయ్య హిట్ సినిమాల జాబితాలోనే దక్కించుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సూపర్ హిట్ కావడంతో... ఆ సమయంలోనే సీక్వెల్‌పై ప్రకటన చేశారు. ఎట్టకేలకు సినిమాను పట్టాలెక్కించారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.