'అఖండ 2' కు కలిసొచ్చే అంశాలు ఇవే!

కథలో డివైన్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయాన్ని టైటిల్ టీజర్ స్పష్టం చేస్తుంది. టైటిల్ లో శివ లింగం, ఢమరుకం, హిమాలయాలు డివైన్ ఇంపార్టెన్స్ ని సూచిస్తున్నాయి.

Update: 2024-10-17 14:06 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కోసం అభిమానులు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్‌', 'అఖండ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ''అఖండ 2: తాండవం'' సినిమా కోసం నాలుగోసారి చేతులు కలిపారు. రీసెంట్ గా ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో గ్రాండ్ గా లాంచ్ చేసి, టైటిల్ టీజర్ ను ఆవిష్కరించారు.

'అఖండ' చిత్రానికి సీక్వెల్ గా 'అఖండ 2: తాండవం' తెరకెక్కనుంది. టైటిల్ టీజర్ తోనే ఇది పాన్ ఇండియా మూవీ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా, అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రూపొందిస్తున్నారు. మొదటి భాగానికి హిందీ డబ్బింగ్ వెర్షన్ కు నార్త్ లో అద్భుతమైన ఆదరణ లభించింది. ఓటీటీలో విడుదలైన తర్వాత ట్రెండ్‌ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో 'అఖండ 2' చిత్రం తప్పకుండా హిందీ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతలు, దైవత్వం, ఆధ్యాత్మికం, భక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా హిందీలో బాగా ఆడుతున్నాయి. కాంతారా, కార్తికేయ 2, హను-మాన్, కల్కి 2898 AD‌‌ లాంటి దక్షిణాది చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ''అఖండ'' సినిమా సైతం ఇలాంటి కాన్సెప్ట్ తోనే రాబోతోంది. కథలో డివైన్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయాన్ని టైటిల్ టీజర్ స్పష్టం చేస్తుంది. టైటిల్ లో శివ లింగం, ఢమరుకం, హిమాలయాలు డివైన్ ఇంపార్టెన్స్ ని సూచిస్తున్నాయి.

'ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది.. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం.. అఖండ తాండవం' అంటూ బాలయ్య చెప్పిన ఓపెనింగ్ డైలాగ్ సినిమాలో శివుడి ప్రస్తావన ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది. మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో, అక్కడి నుంచే రెండో భాగం ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను బోయపాటి రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులోనూ బాలయ్య పోషించే అఘోరా పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ అంశాలన్నీ 'అఖండ 2' పాన్ ఇండియా మార్కెట్ కు ప్లస్ అవుతాయని భావించవచ్చు.

'అఖండ 2: తాండవం' చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ డి డెటాకే & సి రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News