'అఖండ 2' అప్డేట్: మహా కుంభమేళాలో బాలయ్య తాండవం..!
లేటెస్టుగా మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ''అఖండ 2: తాండవం''. 2021 చివర్లో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అఖండ' సినిమాకి ఇది సీక్వెల్. టైటిల్ టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. 'డాకు మహారాజ్' సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. రెట్టింపు ఉత్సాహంతో బోయపాటి చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. లేటెస్టుగా మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని ''అఖండ 2 - తాండవం'' సినిమా షూటింగ్ ను ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభమేళాలో ప్రారంభించినట్లుగా చిత్ర బృందం తెలిపింది. విశ్వాసం, భక్తి యొక్క నిజమైన సారాంశాన్ని సంగ్రహిస్తుందని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మహా కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేర్కొంటారు. అలాంటి డివైన్ ప్లేస్ లోనే ఇప్పుడు బాలయ్య - బోయపాటిల పాన్ ఇండియా సినిమా షూటింగ్ జరుగుతోంది.
'అఖండ' సినిమాలో దేవుళ్ళు, దైవత్వం, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. సెకండ్ పార్ట్ కథలోనూ ఆధ్యాత్మిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందనే విషయం టైటిల్ టీజర్ తోనే స్పష్టం అయింది. టైటిల్ లోగోలో శివ లింగం, ఢమరుకం, హిమాలయాలు వంటివి మూవీలో డివైన్ ఇంపార్టెన్స్ ని సూచిస్తున్నాయి. ఇప్పుడు సినిమా నేపథ్యానికి తగ్గట్టుగానే మహా కుంభమేళాలో కొన్ని కీలకమైన సన్నివేశాలని షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.
'అఖండ' చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, యూనివర్సల్ అప్పీల్ ఉన్న లార్జర్ దేన్ లైఫ్ తరహా పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో బోయపాటి శ్రీను 'అఖండ 2' సినిమాని తెరకెక్కిస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా హై-ఆక్టేన్ యాక్షన్ ను, గ్రిప్పింగ్ డ్రామాను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనూ అఘోరా పాత్ర హైలైట్ అవుతుందని, బాలయ్య తాండవం చూడబోతున్నామని చిత్ర వర్గాలు అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ క్రేజీ సీక్వెల్ లో పలువురు ప్రముఖ నటీనటులు భాగం కానున్నారు.
తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ తో 'అఖండ 2: తాండవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ డి డెటాకే & సి రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. దసరా కానుకగా 2025 సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.