అఖిల్ చాలా పెద్ద ఛాలెంజ్ చేసాడే!
అందుకే అఖిల్ ఇప్పుడు బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్పు మంచిదే..పరాజయం మనిషిలో కసి పట్టుదల నింపుతుంది.
హిట్ విషయంలో అక్కినేని అఖిల్ చాలా పట్టుదలతోనే కనిపిస్తున్నాడని నిన్నటి రోజున తండ్రి నాగార్జున మాటల్ని బట్టి తెలుస్తోంది. హిట్ కొట్టిన తర్వాతే అభిమానుల ముందుకొస్తానని..అంతవరకూ తన ముఖం చూపించనని బలంగా ఫిక్సైన విషయాన్ని నాగ్ అభిమానులకు చేర వేసారు. కాబట్టి అఖిల్ ని ఇప్పట్లో అభిమానులు బయట చూడటం కష్టమేనని అర్దమవుతుంది.
అఖిల్ తాతయ్య ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లోనూ పాల్గొనలేదు అంటే మునుముందు ఇంకే వేడుకలో కూడా కనిపించే అవకాశం లేదు. నాగార్జున సినిమా ఈవెంట్లలోగానీ, నాగచైతన్య సినిమా ఫంక్షన్లలో గానీ ఎక్కడికి అఖిల్ హాజరు కాడని తెలుస్తోంది. చివరికి టాలీవుడ్ నిర్వహించే ఇతర ఈవెంట్లకు కూడా హాజరు కాకపోవచ్చు. ముఖ్యంగా అఖిల్ కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. టాలీవుడ్ నిర్వహించే టోర్నీలో తప్పక పాల్గొంటాడు.
కానీ ఈసారి అలాంటి ఈవెంట్లలో కూడా అఖిల్ పేస్ చూపించే అవకాశం కనిపించలేదు. కెవలం కెరీర్ పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. అఖిల్ పరాజయాలే అతన్ని ఇంతగా పట్టుదలకు దారి తీసినట్లు కనిపిస్తుంది. ఇంతవరకూ అఖిల్ కి సరైన సౌండింగ్ హిట్ ఒకటీ లేదు. చేసిన సినిమాలు రెండు సోసోగా ఆడటం తప్ప! అక్కినేని బ్రాండ్ ఇమేజ్ ఎక్కడా మారు మోగింది లేదు అఖిల్ పరంగా. ఆ ఫ్యామిలీకి ఎలాగూ లవరో బోయ్ ఇమేజ్ ఉంది.
ఆ ఇమేజ్ తప్ప అఖిల్ సోలోగా సాధించింది అంటూ లేదు. ఆ మధ్య ఏజెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు చాటాలనుకున్నాడు. దాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా డిజైన్ చేసారు. కానీ చివరి నిమిషంలో డౌట్ రావడంతో పాన్ ఇండియా రిలీజ్ ని రద్దు చేసి తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసారు. అఖిల్ కంటే ముందు వెనుక..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా హిట్లు కొట్టేస్తున్నారు.
కానీ అఖిల్ కి మాత్రం సాధ్యమవ్వడం లేదు. అందుకే అఖిల్ ఇప్పుడు బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్పు మంచిదే..పరాజయం మనిషిలో కసి పట్టుదల నింపుతుంది. కష్టపడే తత్వాన్ని రెట్టింపు చేస్తుంది. అఖిల్ లో ఇప్పుడవన్నీ మెండుగా కనిపిస్తున్నాయి. కానీ అఖిల్ చేసిన ప్రామిస్ మాత్రం అతి పెద్ద ఛాలెంజ్. దాన్ని చేధించి తీరాల్సిందే సుమీ.