బిబిలో అవమానం, అసలేం జరిగిందంటే.. క్లారిటీ ఇచ్చిన అక్షయ్
ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అక్షయ్ కుమార్ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు.
హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ఇటీవలే పూర్తి అయ్యింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. అక్షయ్ తన తాజా చిత్రం 'స్కై ఫోర్స్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ షోకి హాజరు అయ్యాడు. అయితే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్‌కి ముందే అక్షయ్ కుమార్ అక్కడ నుంచి వెళ్లి పోయాడు. దాదాపు 45 నిమిషాల పాటు అక్షయ్ కుమార్ బిగ్‌బాస్ సెట్‌లో కూర్చుని ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఆలస్యంగా రావడంతో షో ను ఆలస్యంగా మొదలు పెట్టారు. దాంతో అక్షయ్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయాడని, ఫినాలే ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్ కనిపించలేదనే ప్రచారం జరుగుతోంది.
బిగ్‌బాస్ సెట్‌కి సల్మాన్ ఖాన్ ఆలస్యంగా రావడం వల్లే అక్షయ్ కుమార్‌కి కోపం వచ్చిందని, అందుకే షూటింగ్ ప్రారంభం కాకముందే అక్కడ నుంచి వెళ్లి పోయాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై షో నిర్వాహకుల నుంచి స్పందన కోసం మీడియా వారు ప్రయత్నించగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతో మీడియా సర్కిల్స్‌లో ఎవరికి తోచినట్లు వారు పుకార్లు పుట్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. అక్షయ్‌కి జరిగిన అవమానం అంటూ కథనాలు పెద్ద ఎత్తున అల్లేస్తున్నారు. ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అక్షయ్ కుమార్ ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్ సెట్‌లో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అక్షయ్ వివరించాడు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు నేను వెళ్లాను. అయితే సల్మాన్ ఖాన్ 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అయితే ఆయన ఆలస్యంగా రావడం వల్ల నేను అక్కడి నుంచి బయటకు రాలేదు. అప్పటికే నాకు షూటింగ్ టైం అవుతుంది. ముందుగా అనుకున్న ప్రకారం షెడ్యూల్ కి హాజరు కావాల్సి ఉంది. అందుకే 40 నిమిషాల తర్వాత నేను ఆ షూటింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. అందుకే బిగ్‌బాస్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభంకు ముందే అక్కడ నుంచి బయటకు వచ్చాను. అంతే తప్ప సల్మాన్ ఖాన్ పై కోపంతోనో లేదా ఆయన ఆలస్యంగా వచ్చారని తాను అక్కడ నుంచి రాలేదని అక్షయ్ అన్నాడు.
అక్కడ నుంచి వచ్చిన తర్వాత సల్మాన్‌తో మాట్లాడాను అని అక్షయ్ అన్నాడు. అంతే కాకుండా బిగ్‌బాస్ నుంచి నేను బయటకు వచ్చినా వీర్ పహారియా ఉండి మా సినిమా స్కై ఫోర్స్ గురించి చాలా ఆసక్తికర విషయాలను బిగ్‌బాస్ షోలో చెప్పారు. సల్మాన్ సైతం మా సినిమా గురించి మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశాడు. కనుక మా ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం లేదని, దీన్ని ఎక్కువగా రాద్దాంతం చేసే ప్రయత్నం చేయవద్దు అంటూ అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశాడు. ఆ ఇంటర్వ్యూలో తన స్కై ఫోర్స్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా సైఫ్ అలీ ఖాన్‌పై దాడిని ఖండించి, త్వరలోనే అక్షయ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.