ఫిట్ బాడీ కాదు హెల్తీ లైఫ్ ముఖ్యం: అల్లు అర్జున్
అయితే అల్లు అర్జున్ కెరీర్ జర్నీ ఆద్యంతం అతడి మేకోవర్, స్టైల్ ఐకాన్ గా తనను తాను తెరపై ఆవిష్కరించుకున్న తీరును ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` ఫ్రాంఛైజీతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. అతడు నటించిన `పుష్ప 2` చిత్రం 1500కోట్లు వసూలు చేసిందని మేకర్స్ వెల్లడించారు. ఒక తెలుగు నటుడి స్టామినా గురించి దేశవిదేశాల్లో బోలెడంత చర్చ సాగుతోంది. ఇక టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్ గా బన్ని తనను తాను మలుచుకున్న విధానం ఆసక్తిని కలిగిస్తుంది. కెరీర్ జర్నీలో అతడి మేకోవర్ యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమా గంగోత్రి తర్వాత ఆర్య, దేశముదురు చిత్రాలతో అతడు తన సక్సెస్ గ్రాఫ్ ని అమాంతం పెంచుకున్నాడు. జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే, అల వైకుంఠపురములో ఇవన్నీ అతడి స్థాయిని పెంచిన చిత్రాలు. అల వైకుంఠపురములో చిత్రం ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత పుష్ప , పుష్ప 2 చిత్రాలు అతడి రేంజును ఆకాశమే హద్దుగా మార్చాయి.
అయితే అల్లు అర్జున్ కెరీర్ జర్నీ ఆద్యంతం అతడి మేకోవర్, స్టైల్ ఐకాన్ గా తనను తాను తెరపై ఆవిష్కరించుకున్న తీరును ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. టాలీవుడ్ లో తొలి 6 ప్యాక్ హీరోగా అతడు రికార్డులకెక్కాడు. పర్ఫెక్ట్ ఫిట్ బాడీ ని మెయింటెయిన్ చేయడం కోసం బన్ని చాలా శ్రమిస్తాడు. నిరంతరం జిమ్ చేస్తాడు. ఫిట్ బాడీని, పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ ని కొనసాగిస్తున్నాడు. ఇక పుష్ప ఫ్రాంఛైజీలో పుష్పరాజ్ పాత్రలో కొంత రఫ్ గా కనిపించేందుకు అతడు పూర్తిగా మాస్ అవతార్ లో కనిపించాడు. సిసలైన మాస్ స్టైల్ ని ఎలివేట్ చేసాడు. విభిన్నమైన ఆహార్యంతో అతడు మనసులు గెలుచుకున్నాడు.
అయితే 41 ఏళ్ల అల్లు అర్జున్ తన ఫిట్ బాడీ కోసం రెగ్యులర్ డైట్ ఏం తీసుకుంటాడు? ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటి? అంటూ చాలామంది ఆరాలు తీస్తుంటారు. నిజానికి పుష్ప 2 చిత్రీకరణ సమయంలో తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్ పాటించలేదని జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ వెల్లడించారు. తాను పనిచేసే సినిమా అవసరాలకు అనుగుణంగా తన డైట్, ఫిట్‌నెస్‌ని సర్దుబాటు చేస్తానని తెలిపాడు.
అయితే ప్రతిరోజూ ఉదయం తన అల్పాహారం దాదాపు ఒకేలా ఉంటుందని, లంచ్, డిన్నర్ మారుతూ ఉంటాయని తెలిపాడు. అలాగే ఉదయం అల్పాహారంలో గుడ్లు తీసుకుంటానని తెలిపాడు. రోజు చివరి భోజనం... ఆరోజు అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు చాక్లెట్లు ఇష్టంగా తింటానని తెలిపాడు.
అలాగే వేకువ ఝామున ఖాళీ కడుపుతో 45 నిమిషాల నుండి ఒక గంట వరకు పరిగెత్తుతానని వెల్లడించాడు. శక్తి ఉంటే వారానికి ఏడు రోజులు లేదా సోమరితనంగా ఉంటే వారానికి మూడు రోజులు మాత్రమే రన్నింగ్ చేస్తానని చెప్పాడు. నిజానికి మంచి ఫిట్ నెస్ కొనసాగించడం సవాళ్లతో కూడుకున్నది. మంచి శరీరం కంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని కూడా అల్లు అర్జున్ అన్నారు. అలాగే పాల ఉత్పత్తులతో అలెర్జీ సమస్య ఉన్నందున వాటికి దూరంగా ఉంటానని కూడా వెల్లడించాడు.
వైద్యుల సలహాలు:
రోజూ తీసుకునే గుడ్లతో ప్రొటీన్ కావాల్సినంత అందుతుంది. శరీరంలో సుగర్ స్థాయిని పెరగనీయదు. విటమిన్లు ఎ, బి2, బి5, బి12, బి9 పుష్కలంగా లభిస్తాయి. అయితే పచ్చసొన ఎక్కువ తినకూడదని డైటీషియన్లు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో రన్నింగ్ చేయడం వల్ల కొవ్వు బాగా కరుగుతుందని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు ఇది మంచి వ్యాయామం. చెప్పులు లేకుండా పరిగెత్తడం కూడా చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని వైద్యులు చెబుతున్నారు.