అట్లీకి అంత సీనుందా?
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్.. ఈ వార్త తొలిసారి బయటికి వచ్చినపుడు బన్నీ అభిమానుల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు.;

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్.. ఈ వార్త తొలిసారి బయటికి వచ్చినపుడు బన్నీ అభిమానుల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు. అట్లీ ఇప్పటిదాకా తీసిన ఐదు చిత్రాలూ బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ తన మీద చాలామందికి సదభిప్రాయం లేదు. అందుక్కారణం అతను ఎప్పుడూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీస్తుంటాడు. పాత కథలనే అటు ఇటు తిప్పి తీస్తాడనే అభిప్రాయం బలపడిపోయింది. ‘రాజా రాణి’ నుంచి ‘జవాన్’ వరకు అతడి ప్రతి సినిమాలోనూ పాత చిత్రాల ఛాయలు గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ లాంటి మెగా మూవీ తర్వాత బన్నీ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగల చిత్రం అట్లీ తీయగలడా అనే సందేహాలు కలిగాయి. కానీ ఈ రోజు హాలీవుడ్ వీఎఫెక్స్ స్టూడియో నిపుణులను బన్నీ, అట్లీ కలిసి తమ సినిమాకు సంబంధించి ప్రి విజువలైజేషన్ పనుల్లో భాగమైన వీడియో చూశాక ఈ మూవీ లెవెలే వేరు అనే అభిప్రాయం కలిగింది.
‘అవతార్’ సహా ఎన్నో భారీ హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన వీఎఫెక్స్ నిపుణులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ప్రోమో వీడియో చూస్తే అట్లీ ఈసారి సగటు మాస్ మూవీ కాకుండా.. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ మెగా బడ్జెట్ మూవీ తీయబోతున్నాడని అర్థమవుతోంది. హాలీవుడ్ వీఎఫెక్స్ నిపుణులు.. ఈ సినిమా స్క్రిప్టు గురించి స్టన్నింగ్, అన్ బిలీవబుల్ లాంటి మాటలు మాట్లాడ్డం అందరికీ పెద్ద షాకే. కిచిడీ కథలు రాసే అట్లీ.. హాలీవుడ్ టెక్నీషియన్లనే ఆశ్చర్యపరిచే స్క్రిప్టు రెడీ చేశాడంటే మన అభిమానులకు నమ్మశక్యం కావడం లేదు. నిజంగా అట్లీ అంత స్టన్నింగ్ స్క్రిప్టు రెడీ చేశాడా.. లేక సినిమాకు హైప్ తేవడం కోసం వాళ్లతో అలా మాట్లాడించారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లీ ట్రాక్ రికార్డు అలాంటిది మరి. నిజంగా హాలీవుడ్ టెక్నీషియన్లను ఆశ్చర్యపరిచే స్థాయిలో స్క్రిప్టు ఉండి.. ప్రి విజువలైజేషన్ విజువల్స్‌లో చూపించినంత గ్రాండియర్ సినిమాలో ఉంటే ఈ ప్రాజెక్టుకు ఆకాశమే హద్దు.