#AA22xA6: ఇది నెవ్వర్ బిఫోర్ ప్లాన్ సామీ..

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రోమోలో, అల్లు అర్జున్ అట్లీ అమెరికాలో ప్రముఖ గ్రాఫిక్స్ సంస్థల వద్ద సమావేశమవుతున్న దృశ్యాలు చూపించారు.;

Update: 2025-04-08 06:19 GMT
Allu Arjun Atlee Film Begins

భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడనటువంటి ప్రాజెక్టుతో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గ్రాండ్ లెవెల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ అనంతరం అల్లు అర్జున్ ఎలాంటి చిత్రాన్ని ఎంచుకుంటాడా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో, ఈ చిత్రానికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోతోనే ఊహించని కిక్ ఇచ్చారు. ఇది ఒక సాధారణ సినిమా కాదు, భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం అని అర్ధమవుతుంది.

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రోమోలో, అల్లు అర్జున్ అట్లీ అమెరికాలో ప్రముఖ గ్రాఫిక్స్ సంస్థల వద్ద సమావేశమవుతున్న దృశ్యాలు చూపించారు. ‘అవతార్’, ‘ఐరన్ మ్యాన్’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్’, ‘అవెంజర్స్’ లాంటి చిత్రాలకు పనిచేసిన అంతర్జాతీయ నిపుణులు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పించారు. ‘‘ఈ కథ విన్న వెంటనే ఆశ్చర్యపోయాం... ఇది ఇప్పటి వరకు వినని గొప్ప కథ’’ అని వారు చెప్పారు.

ఇంతకు ముందు మన తెలుగు చిత్రాలలో ఈ స్థాయిలో ప్రణాళికలు జరగలేదు. చిత్రీకరణ ప్రారంభం కాకముందే ఈ విధంగా టెక్నికల్ ఏర్పాట్లు చేయడం గొప్ప విషయం. ‘‘కల్పన ఆవేశంతో కలిసే చోటు’’, ‘‘సరిహద్దులు దాటి కొత్త లోకాలు నిర్మించటం’’ వంటి ట్యాగ్ లతో ఈ సినిమా స్వరూపాన్ని ఆవిష్కరించారు. ఇది సాధారణ సూపర్ హీరో చిత్రంగా కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే కథాంశమని సమాచారం.

లాస్ ఏంజెల్స్‌లోని లోలా గ్రాఫిక్స్, ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐరన్ హెడ్ స్టూడియో, ఐఎల్‌ఎమ్ టెక్నోప్రాప్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ చిత్రానికి పనిచేస్తున్నాయని అర్ధమవుతుంది. ఆస్కార్ అవార్డు గెలిచిన నిపుణులు ఈ సినిమాకి సహకరించటం విశేషం. కేవలం గ్రాఫిక్స్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం, ప్రయోగాత్మక పద్ధతులపై అధ్యయనం చేయడం చూస్తే ఈ సినిమా ఎంత గొప్ప స్థాయిలో రూపొందుతున్నదో అర్థమవుతుంది.

ఈ చిత్రం 2026లో విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. సన్ పిక్చర్స్ అధినేత కలానిధి మారన్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియో లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. చిత్రంలో గ్రాఫిక్స్, 3D ఫార్మాట్, జంతువులకు సంబంధించిన సీన్స్ పద్ధతులపై అత్యుత్తమ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంతటి భారీ ప్రణాళికలతో బన్నీ చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటేలా ఉంది. ఇది పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న సినిమా. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిగా కట్టుబడి, వ్యక్తిగతంగా గ్రాఫిక్స్ బృందాలను కలుసుకుంటున్న తీరు చూస్తే ఇది ఆయన సినీ జీవితంలో ఒక కీలక మలుపు కానుంది. ఏదేమైనా అట్లీ అల్లు అర్జున్ ప్లాన్ గట్టిగానే ఉండనున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News