అల్లు అర్జున్ - అట్లీ.. సినిమా ఎలా ఉండబోతోందంటే?
కథలో కొత్త వాతావరణాన్ని రూపొందించేందుకు గ్రాండ్ సెట్స్, హైటెక్ విజువల్స్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్.;
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల స్థాయి పూర్తిగా మారిపోయింది. ఇక మామూలు మాస్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమవుతోంది. భారీ బడ్జెట్, విభిన్న కథ, ఊహించని మేకింగ్ స్టైల్ తప్పకుండ ఉండాలి. ముఖ్యంగా దర్శకులు ఇప్పుడు కథకు తగ్గట్లుగా కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అదే రూట్లో మరో కాంబినేషన్ కూడా రెడీ అవుతోంది.
రాజమౌళి ‘బాహుబలి’ కోసం మహిష్మతిని సృష్టించాడని, ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ లో గోల్డ్ ఫీల్డ్ మాఫియాను చూపించాడని, అదే ట్రెండ్ సలార్, దేవర సినిమాల వరకూ కొనసాగింది. ఇప్పుడు ఇదే తరహాలో అల్లు అర్జున్ - అట్లీ సినిమా కూడా రూపొందబోతోందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను జూన్ లో లాంచ్ చేసి, 2026 ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే, ఈ సినిమా షూటింగ్ కోసం ఏడాది సమయం వెచ్చించబోతున్నారు.
చూస్తుంటే అట్లీ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఉండేలా, విభిన్నమైన స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పక్కా కమర్షియల్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న అట్లీ, ఈసారి తన మార్క్ స్టైల్‌ను ‘కేజీఎఫ్’ లేదా ‘దేవర’ తరహాలో మాస్ లెవెల్‌కు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ‘జవాన్’తో బాలీవుడ్‌ను శాసించిన అట్లీ, ఇప్పుడు టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని స్కేల్‌లో సినిమా చేయాలని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమా గురించి బయటకు వస్తున్న అప్‌డేట్ ప్రకారం, ఒక కొత్త ప్రపంచాన్ని సెటప్ చేసేలా కథను డిజైన్ చేసినట్లు సమాచారం. కథలో కొత్త వాతావరణాన్ని రూపొందించేందుకు గ్రాండ్ సెట్స్, హైటెక్ విజువల్స్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బన్నీ కోసం హై ఇంటెన్సిటీ క్యారెక్టర్ డిజైన్ చేయడం మాత్రమే కాకుండా, స్టైల్, లుక్ పరంగా కూడా కొత్తగా కనిపించేలా ఫుల్ మేకోవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా సినిమా కావడం వల్ల, ఇందులో తమిళ, హిందీ పరిశ్రమల నుండి సీనియర్ నటులను తీసుకోవడానికి కూడా స్క్రిప్ట్ రీ డిజైన్ జరుగుతోందని సమాచారం. ఇప్పుడు బన్నీ - అట్లీ కాంబినేషన్ కూడా అదే తరహాలో ప్రేక్షకులను ఊహించని దిశగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామా, ఒక రివోల్యూషనరీ కథ, పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనే మూడు ప్రధాన కథాంశాలతో ఈ సినిమా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఈ సినిమా కోసం బడ్జెట్ పరంగా కూడా భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లు టాక్. బన్నీ క్రేజ్, అట్లీ ట్రాక్ రికార్డ్‌ను బట్టి ఈ సినిమా 400-500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ‘పుష్ప 2’తో బన్నీ మార్కెట్ 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించే స్థాయికి వెళ్లింది. దీంతో, ఈ సినిమా తర్వాత ఇంకో మెట్టు పైకి వెళ్లేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ లెవెల్‌లో సినిమాకు హైప్ క్రియేట్ చేయాలంటే, కేవలం స్టోరీ, యాక్షన్ మాత్రమే కాకుండా, అట్లీ ప్రత్యేకమైన మాస్ కమర్షియల్ ట్రీట్మెంట్ కూడా ఉండాలి. మరి అట్లీ ప్లానింగ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.