బన్నీ బర్త్‌డే.. ఫ్యాన్స్ చాలా ఊహించుకుంటున్నారు

అల్లు అర్జున్‌ బర్త్‌డే కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే అనే విషయం తెల్సిందే.;

Update: 2025-04-02 05:13 GMT
బన్నీ బర్త్‌డే.. ఫ్యాన్స్ చాలా ఊహించుకుంటున్నారు

అల్లు అర్జున్‌ బర్త్‌డే కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే అనే విషయం తెల్సిందే. ఆ రోజు దేశ వ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్‌ పండగ చేసుకోబోతున్నారు. అల్లు అర్జున్‌ నటించిన 'ఆర్య 2' సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈమధ్య కాలంలో హీరోల బర్త్‌డే సందర్భంగా వారి సూపర్‌ హిట్‌ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్‌ కావడం మనం చూస్తున్నాం. అయితే డబ్బింగ్ అయ్యి మరీ ఇతర భాషల్లో రీ రిలీజ్ కావడం అనేది జరగలేదు. ఆర్య 2 సినిమాను డబ్‌ చేసి హిందీలోనూ అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం హిందీ డిస్ట్రిబ్యూటర్స్‌ సైతం రెడీగా ఉన్నారని సమాచారం అందుతోంది.

ఆర్య 2 సినిమాను ఏప్రిల్‌ 5న రీ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ రీ రిలీజ్ చేయడం ద్వారా అరుదైన ఘనతను అల్లు అర్జున్‌ అందుకోబోతున్నాడు. పుష్ప 2 సినిమా నార్త్‌ ఇండియాలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఆర్య 2 ను హిందీలో రీ రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారు. బన్నీ బర్త్‌డే అంటే రీ రిలీజ్ ఒక్కటే సరిపోదని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ కన్ఫర్మ్‌ అయింది. కనుక ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ అప్‌డేట్‌ ఏమైనా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం ప్రకటన చేసి వదలకుండా టీజర్‌ లేదా గ్లిమ్స్ వంటివి ఇస్తారని ప్యాన్స్ ఊహించుకుంటున్నారు.

పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్‌ తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాకపోవడంతో అట్లీతో మొదట సినిమాకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్‌ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందని నిర్మాత నాగవంశీ తాజాగా ప్రకటించాడు. అంతే కాకుండా ఈ సినిమా గురించి ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కనుక బన్నీ బర్త్‌డేకి ఆ సినిమా అప్‌డేట్‌ కూడా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌ చాలా ఆలస్యం చేశారు. కనుక బన్నీ బర్త్‌డేకి ఏమైనా ప్రకటన ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచినట్లు అవుతుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆర్య 2 రీ రిలీజ్‌తో పాటు అట్లీ సినిమా కీలక అప్డేట్‌ లేదా టీజర్ ఉంటుందని ఊహించుకుంటున్న ఫ్యాన్స్ త్రివిక్రమ్‌ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ ఉంటుందనే ఊహలో ఉన్నారు. మరి ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నట్లు బన్నీ బర్త్‌డే రోజు ఈ మూడు జరుగుతాయా అనేది చూడాలి. పుష్ప 2 సినిమాతో దాదాపు రూ.1900 కోట్ల వసూళ్లు సాధించిన అల్లు అర్జున్‌ తదుపరి సినిమాలు సైతం అదే స్థాయిలో ఉండే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే కాస్త ఆలస్యం అయినా త్రివిక్రమ్‌ సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాడు. మరో వైపు జవాన్‌ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన అట్లీ దర్శకత్వంలోనూ సినిమాను చేస్తున్నాడు. గత ఏడాది పుష్ప 2 తో వచ్చిన అల్లు అర్జున్‌ ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేసే అవకాశాలు లేవు. కానీ వచ్చే ఏడాదిలో అట్లీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News