అల్లు అర్జున్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ అదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప 2: ది రూల్'' సినిమాతో బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప 2: ది రూల్'' సినిమాతో బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. పుష్పరాజ్ దెబ్బకు బాలీవుడ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా బాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిందీ మూవీగా నిలవడం, ఒక తెలుగు హీరో హిందీలో బిగ్గెస్ట్ యాక్టర్ గా అవతరించడం మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం 'పుష్పరాజ్' వల్లనే సాధ్యమైందని చెప్పాలి.
పుష్పరాజ్.. అల్లు అర్జున్ కెరీర్ లో ఐకానిక్ క్యారక్టర్. డైరెక్టర్ సుకుమార్ సృష్టించిన ఈ లార్జర్ దెన్ లైఫ్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్, 'నీ యవ్వ.. తగ్గేదేలే' అంటూ ఒక విధమైన యాటిట్యూడ్ తో అతను చూపించిన మేనరిజానికి అంతా ఫిదా అయ్యారు. 'పుష్ప 1' ఓటీటీలో రిలీజైన తర్వాత పుష్పరాజ్ రీచ్ గ్లోబల్ స్థాయిలో పాకింది. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు ఒక అంగవైకల్యం ఉన్న పాత్రను సూపర్ హీరో మాదిరిగా ఆదరిస్తున్నారంటే, ఆ క్యారక్టర్ జనాల్లో ఎంత బలమైన ముద్ర వేసుకుందనే విషయం అర్థమవుతుంది.
పుష్ప పార్ట్-1లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అధ్బుతమైన నటన కనబరిచారు. అదే ఆయనకు పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చిపెట్టింది.. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ ను కూడా సంపాదించి పెట్టింది. దీంతో 'పుష్ప 2' సినిమాలో పుష్పరాజ్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా, మాసీగా డిజైన్ చేశారు సుకుమార్. ఈసారి అల్లు అర్జున్ కూడా తన నట విశ్వరూపాన్ని చూపించారు. మరో జాతీయ అవార్డ్ గ్యారంటీ అనే రేంజ్ లో పర్ఫామెన్స్ చేశారు. జాతర సీన్‌లో ఆడియన్స్ కు ఒళ్ళు జలదరించేలా నటించారు. ఒక కమర్షియల్ సినిమాలో హీరో పాత్ర గురించి ఇంతగా మాట్లాడుకోవడం ఇటీవల కాలంలో జరగలేదు.
నిజానికి పుష్ప సినిమాలోని కంటెంట్ విషయంలో కంప్లెయింట్స్ వచ్చినా.. అల్లు అర్జున్ తన నటనతో థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులు అవన్నీ మర్చిపోయేలా చేశారని చెప్పాలి. తెర మీద పుష్పరాజ్ ఏమి చేసినా జనాలకు నచ్చుతోందంటే.. ఆయన పర్ఫామెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేవలం పుష్పరాజ్ పాత్ర కోసమే రిపీటెడ్ గా సినిమా చూస్తున్న ఆడియన్స్ ఉన్నారు. ఇలాంటి ఐకాన్ క్యారక్టర్ బన్నీకి దొరకడం నిజంగా తన అదృష్టమనే అనుకోవాలి. కాకపోతే అతని క్రేజ్ ను కాపాడుకుంటూ, రాబోయే రోజుల్లో అంతకుమించిన పాత్రలు ఎంచుకోవడమే స్టైలిష్ స్టార్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్.
ఇంతకముందు రెబల్ స్టార్ ప్రభాస్ కు 'బాహుబలి' లాంటి ఐకానిక్ పాత్ర పడింది. ఈ పాత్ర ఆయన్ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.. కెరీర్ నే మలుపు తిప్పింది. బాహుబలి అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే బాహుబలి అనే విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందుకే ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు, పాత్రలు అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. దాన్నుంచి బయటకు వచ్చి జనాలను మెప్పించడానికి డార్లింగ్ కి చాలా సమయమే పట్టింది. ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ పై కూడా ఆడియన్స్ అలాంటి అంచనాలు పెట్టుకుంటారు. పుష్పరాజ్ కు మించి ఇంకేదో ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి బన్నీ తన క్రేజ్ ను కాపాడుకునేలా ఎలాంటి కథలతో వస్తాడో, ఎలాంటి అప్రోచ్ తో ముందుకు వెళ్తారో చూడాలి.