నార్త్‌లో బ‌న్ని స్టామినా ఎంతో తెలిసొచ్చింది!

దేశంలోని అన్ని ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్ల‌ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-11-18 04:47 GMT

దేశంలోని అన్ని ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్ల‌ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. తొలిగా బీహార్ పాట్నాలో ఏర్పాటు చేసిన ఈవెంట్ అద్భుత‌మైన స‌క్సెస్ సాధించింది. పాట్నాలో గాంధీ మైదాన్ కిట‌కిట‌లాడింది. అక్కడికి అల్లు అర్జున్ అభిమానులు ఊక వేస్తే రాల‌నంత మంది హాజ‌ర‌య్యారు. ఎటు చూసినా జన సందోహంతో గ్రౌండ్ స‌ముద్రాన్ని త‌ల‌పించింది. అప‌రిమితంగా వ‌చ్చిన అభిమానుల‌ను కంట్రోల్ చేయ‌డం పోలీసుల వ‌ల్ల కాలేదు. తోపులాట‌లు జ‌ర‌గ‌డంతో పోలీసులు ఒకానొక ద‌శ‌లో లాఠీ ఛార్జ్ చేయాల్సి వ‌చ్చింది.


నిజానికి ఈ స‌న్నివేశం ఉత్త‌రాదిన మాస్ లో బ‌న్నికి ఉన్న సూప‌ర్ ప‌వ‌ర్‌ని ఎలివేట్ చేసింది. పుష్ప ఫ్రాంఛైజీ చిత్రాల కోసం ఉత్త‌రాది ఆడియెన్ ఎంత ఆస‌క్తిగా వేచి చూస్తున్నారో కూడా ఇది తెలియ‌జేస్తోంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లోని మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ `పుష్ప2: ది రూల్` డిసెంబర్ 05న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. పాట్నాలో రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కేవ‌లం గంటల్లోనే కోటి పైగా వ్యూస్ సాధించింది. చాలా సునాయాసంగా 10 కోట్ల (100 మిలియ‌న్ లు) వ్యూస్ ని సాధించ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే పాట్నాలో ఈవెంట్ కి నిజానికి తెలుగు రాష్ట్రాల ఈవెంట్ ని మించి అభిమానులు గుంపులుగా రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌మ అభిమాన న‌టుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని చూసేందుకు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. మైదానం కిక్కిరిసింది. అరుపులు విజిల్స్ తో హోరెత్తింది. ట్రైల‌ర్ వీక్షించిన అభిమానులు క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో హోరెత్తించారు. ఈ ఈవెంట్ లో ప్ర‌జ‌ల్ని అదుపు చేస‌సేందుకు వంద‌లాదిగా పోలీసులు, గార్డులు, బౌన్స‌ర్లు నిరంత‌రం శ్ర‌మించారు. బ‌న్ని ఇత‌ర వీవీఐపీలు ఉన్న గ్యాల‌రీలోకి అభిమానులు దూసుకురావ‌డంతో యాంక‌ర్ మైక్ లో హెచ్చ‌రిస్తూ.. ప‌దే ప‌దే వారిని నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించారు.

``నా జీవితంలో నార్త్ ఇండియాలో ఏ సినిమాకి ఇంత భారీ జనాన్ని చూడలేదు`` అని హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవాలి. పాట్నా ఈవెంట్ కి విచ్చేసిన అభిమానుల‌కు అల్లు అర్జున్, ర‌ష్మిక స‌హా త‌డానీ, మైత్రి నిర్మాత‌లు ర‌విశంక‌ర్, న‌వీన్ ఎర్నేని వంటి ప్ర‌ముఖులు ఫిదా అయిపోవ‌డమే గాక వారి ప్రేమ‌కు ప‌దే ప‌దే ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసారు. దీంతో ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ల‌ను మించి ఇది స‌క్సెసైంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. ఇత‌ర మెట్రో న‌గ‌రాలైన ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్, కోల్ క‌త స‌హా అన్ని న‌గరాల్లో ఈవెంట్లు ఇదే విధంగా సక్సెసైతే పుష్ప 2కి థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం ఏ రేంజులో ఉంటుందో ఊహించ‌వ‌చ్చు.

ఉత్త‌రాదిన మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బ‌న్నికి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అత‌డు న‌టించిన హిందీ డబ్బింగ్ సినిమాల‌తోనే అన్నిచోట్లా ఫాలోవ‌ర్స్ పెరిగారు. ఇప్పుడు పుష్ప -1 తో సుకుమార్ అత‌డి స్థాయిని అమాంతం పెంచాడు. అలాగే పుష్ప 2 తో దానిని మ‌రో ఎత్తుకు చేర్చ‌నున్నాడు. ప్ర‌భాస్ త‌ర్వాత బ‌న్నికి దేశ‌వ్యాప్తంగా యూత్, మాస్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని ప్రూవ్ అయింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైద‌రాబాద్ లో జ‌రిగే ఈవెంట్‌కి భారీగా అభిమానులు త‌ర‌లిరావ‌డం ఖాయంగా తెలుస్తోంది. నిజ‌మైన పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కి సిస‌లైన అర్థం చెప్పేందుకు తెలుగు హీరోల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ప్ర‌భాస్, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్ రేసులో ఉన్నారు. రాజ‌మౌళితో సినిమా చేస్తున్న మ‌హేష్ బాబు కూడా పోటీబ‌రిలోకి వారియ‌ర్‌లా దూసుకొస్తున్నారు.

Tags:    

Similar News