బన్నీ.. నెక్స్ట్ ప్లానేంటి?
అయితే దీని తర్వాత బన్నీ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా వరల్డ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. అస్సలు తగ్గేదేలే అంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా సాధించని విధంగా తొలి రోజే ₹ 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. నార్త్ లో ₹72 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ రికార్డులను చేరిపేసింది. తెలుగు, హిందీల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. అయితే దీని తర్వాత బన్నీ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది.
'పుష్ప 2' తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో చిత్రం ఇది. అందుకే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘గుంటూరుకారం’ చిత్రానికి వచ్చిన ట్రోల్స్ కు సరైన సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టలెక్కడానికి మరికొన్ని నెలలు సమయం పట్టేలా ఉంది.
త్రివిక్రమ్ ఈసారి తన రూటు మార్చి, బన్నీ కోసం అతి పెద్ద కాన్వాస్ ఉన్న కథ ను రెడీ చేస్తున్నారు. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రారంభం కావ్వొచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరవాత ఏప్రిల్ లేదా మే నెలలో మొదలవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా జూన్ వరకూ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే అల్లు అర్జున్ దాదాపు 7 నెలల పాటు సినిమా షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉండే పరిస్థితి ఉంటుంది.
'పుష్ప' రెండు సినిమాల కోసం ఐదేళ్ల పాటు తీవ్రంగా కష్టపడ్డాడు అల్లు అర్జున్. 'పుష్ప 2'కి రెస్ట్ లేకుండా వర్క్ చేసాడు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఉరుకులు పరుగుల మీద నిర్విరామంగా పని చేశాడు. ఓవైపు షూటింగ్ లో పాల్గొంటూనే, మరోవైపు డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఇంకో పక్క మూవీ ప్రమోషన్స్ ను తన భుజాన వేసుకొని ఒక్కడే దేశ వ్యాప్తంగా తిరిగాడు. తన కష్టానికి తగిన ఫలితం అందుకున్నాడు. అయితే ఇప్పుడు బన్నీకి కాస్త రెస్ట్ అవసరం వుంది. కాబట్టి వెంటనే తదుపరి చిత్రాన్ని ప్రారంభించాలనే తొందరేం లేదు.
ప్రస్తుతం 'పుష్ప 2' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని స్టార్ట్ చేసే వరకూ కాస్త విరామం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏడు నెలల సమయం ఉన్నా, ఈ గ్యాప్ లో మరో సినిమా చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ గ్యాప్ లో ఎక్కువగా తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయనున్నారు. హాలిడేకి వెళ్లొచ్చే అవకాశం ఉందని టాక్. అలానే దర్శకుల నుంచి కొత్త కథలు వినడానికి తనకు దొరికిన సమయాన్ని వినియోగించుకోనున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ గానీ వీలైనంత త్వరగా స్క్రిప్టు పనులు పూర్తి చేస్తే, బన్నీ వెంటనే సెట్స్ మీదకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు.
త్రివిక్రమ్ తన కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో, చాలా సీరియస్‌గా ఈ స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారట. అల్లు అర్జున్ కోసం మైథలాజికల్ టచ్ ఉన్న కథను లేదా హిస్టారికల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. గీతా ఆర్ట్స్, హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ లో భారీ కాన్వాస్ లో ఈ బన్నీ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రూపొందనుంది. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.