పవన్ తో బన్నీ భేటీ అవుతాడా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీ నివాసానికి వెళ్లి పరామర్శించారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అలాంటి సమయంలో బన్నీ స్వయంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు మామయ్యలను ఒకేరోజు కలిసి చాలాసేపు మాట్లాడి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తారా? అనే చర్చలు మొదలయ్యాయి.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి, నాగబాబు అన్ని పనులు పక్కన పెట్టి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. చిరు అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళడానికి రెడీ అయ్యారని న్యూస్ వచ్చింది కానీ, పోలీసుల విజ్ఞప్తితో ఆగిపోయారని తెలుస్తోంది. ఇక బన్నీ అరెస్ట్ అయిన రోజు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వస్తున్నారని ప్రచారం జరిగింది, కానీ ఆయన రాలేదు. శనివారం సాయంత్రం పవన్ హైదరాబాద్ కు రావడంతో, తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి బన్నీ ఇంటికి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరగలేదు. అల్లు అర్జున్ ను పరామర్శించకుండానే తిరిగి అమరావతికి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు బన్నీ స్వయంగా పవన్ వద్దకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి, నాగబాబులను కలిసిన అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్ తో భేటీ అవ్వాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పరామర్శించి.. ఆ తరువాత అమరావతికి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎంను కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కాకపోతే ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నందున, అన్నీ చక్కబడిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ను బన్నీ కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే పవన్ - బన్నీ భేటీ జరిగితే మాత్రం అన్నిటికీ ఫుల్ స్టాప్ పడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్, మెగా కాంపౌండ్ కు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బన్నీ నేరుగా నంద్యాల వెళ్లి తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో, ఇరు వర్గాల మధ్య విభేదాలు నిజమేననే రూమర్స్ బలపడ్డాయి. అప్పటి నుంచి అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి, సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ వచ్చారు. 'పుష్ప 2' రిలీజ్ వరకూ ఈ ట్రోలింగ్ కొనసాగుతూనే వచ్చింది. అయితే అల్లు అర్జున్ తమ మధ్య గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేసారు.
'పుష్ప 2' సినిమాకు టికెట్ రేట్లు పెంచినందుకు ‘కల్యాణ్ బాబాయ్’ అంటూ సక్సెస్ మీట్ లో బన్నీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పారు. అంతకముందు 'అన్ స్టాపబుల్' టాక్ షోలోనూ పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిరంజీవి, నాగబాబు స్వయంగా బన్నీ ఇంటికి వెళ్తే.. ఆదివారం అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ తో భేటీ అయి కృతజ్ఞతా భావం చూపించారు. వీరి కలయికతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కవర్ అయిందనే భావన కలుగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయితే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చేస్తుంది.