ఏడాది అంతా ఏం చేశారు త్రివిక్రమ్‌ సర్‌..!

పుష్ప 2 సినిమా వచ్చి మూడు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ లేదు.

Update: 2025-02-11 05:30 GMT

అల్లు అర్జున్‌ 'పుష్ప 2' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు పుష్ప రెండు పార్ట్‌ల కోసం అల్లు అర్జున్‌ కష్టపడ్డారు. గత ఏడాది డిసెంబర్‌లో పుష్ప 2 విడుదలైంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ తదుపరి సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అని రెండేళ్ల క్రితమే కన్ఫర్మ్‌ అయ్యింది. గత ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్‌ అప్పటి నుంచి అల్లు అర్జున్‌తో సినిమా కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లు చెబుతూ వస్తున్నారు. పుష్ప 2 సినిమా వచ్చి మూడు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ లేదు.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కథ పూర్తి కాలేదని, స్క్రిప్ట్‌ వర్క్‌ విషయంలో ఆలస్యం జరుగుతుందని తెలుస్తోంది. రాజమౌళి తన సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌కి ఏడాది సమయం తీసుకుంటారు. త్రివిక్రమ్‌కి సైతం ఏడాదికి పైగానే సమయం లభించింది. ఈ ఏడాది కాలంలో సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసి ఉంటే వెంటనే షూటింగ్‌ ప్రారంభం అయి ఉండేది కదా అంటూ అల్లు అర్జున్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ ఆలస్యం చేయడం వల్ల ఈ ఏడాదిలో సినిమా ప్రారంభం అయ్యేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఎలాగూ సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు, కనీసం వచ్చే ఏడాదిలో అయినా సినిమా విడుదల చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అల్లు అర్జున్‌ ఇప్పటికే పుష్ప 2 సినిమా నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారు. ఇటీవల తన లుక్‌ను మార్చడంతో పాటు విదేశాలకు టూర్‌కి సైతం వెళ్లి వచ్చారు. ఎప్పుడు త్రివిక్రమ్‌ రెడీ అంటే అప్పుడే షూటింగ్‌కి జాయిన్‌ అయ్యేందుకు అల్లు అర్జున్‌ రెడీగా ఉన్నారు. కానీ త్రివిక్రమ్‌ మాత్రం ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌లోనే ఉన్నారు. ఏడాది అంతా ఏం చేశారు సర్‌ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఈ సమయంలో త్రివిక్రమ్‌ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య బన్నీ వాసు ఈ సినిమా గురించి చెబుతూ త్రివిక్రమ్‌ గారి మొదటి పాన్‌ ఇండియా మూవీ అని ప్రకటించారు.

మరో వైపు అల్లు అర్జున్‌ తమిళ్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కథ విన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల అట్లీ హైదరాబాద్‌ వచ్చి అల్లు అర్జున్‌ని కలిశాడు. పాన్‌ ఇండియా స్థాయిలో జవాన్‌ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న అట్లీ తదుపరి సినిమాను అల్లు అర్జున్‌తో చేస్తాడనే టాక్ తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. అల్లు అర్జున్‌, అట్లీ మీటింగ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అట్లీ చెప్పిన కథకి బన్నీ సమాధానం ఏంటి అనేది సైతం క్లారిటీ లేదు. అల్లు అర్జున్‌ తదుపరి సినిమా కచ్చితంగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుంది అంటూ మెగా కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది. కనుక త్వరగా త్రివిక్రమ్‌ కథను రెడీ చేసి షూటింగ్‌ ప్రారంభించాలని బన్నీ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుందని ఆశిద్దాం. 2025 సమ్మర్‌లో సినిమాను ప్రారంభించి 2026 చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News