మెగా సేవలపై నీచంగా మాట్లాడిన ఒకరిని జైలుకు పంపాను
పవన్ కల్యాణ్ బ్రో విడుదలైన రెండు వారాల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో మెగా చిత్రం భోళా శంకర్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది
పవన్ కల్యాణ్ బ్రో విడుదలైన రెండు వారాల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో మెగా చిత్రం 'భోళా శంకర్' గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న దర్శకుడు మెహర్ రమేష్‌కి చిరు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా వేదాళం చిత్రానికి అఫీషియల్ రీమేక్. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, తమన్నా భాటియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ సహాయక తారాగణం.
నేటి సాయంత్రం భోళాశంకర్ ప్రీరిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న బాస్ అల్లు అరవింద్ మెగాస్టార్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఒక మాటను నొక్కి చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ కి మేం ఎంతటి అభిమానులమో ఈరోజు చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చేస్తున్న సేవలను కించపరుస్తూ నీచంగా మాట్లాడిన ఒకరిని జైలుకు పంపేవరకూ ఇరవై ఏళ్లపాటు పోరాటం సాగించిన అభిమానం నాది. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.. అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాక.. మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవలపై కామెంట్లు చేసిన ప్రముఖ హీరోపై అల్లు అరవింద్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఏళ్ల తరబడి విచారణ దశలో ఉంది. ఇటీవలే ఈ వివాదంపై తీర్పు వెలువడింది. ఇందులో సదరు హీరోని తప్పు పడుతూ న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు. అటుపై సదరు హీరోకి వెంటనే జైలు శిక్షను కోర్టు అమలు చేసిన సంగతి తెలిసిందే. భోళాశంకర్ ఆగస్టు లో విడుదలకు రెడీ అవుతోంది.