జాతీయ అవార్డ్: చరణ్, ఎన్టీఆర్‌లను కాదని బన్నీకి పట్టం!
పుష్ప చిత్రంలో పుష్పరాజ్ గా అతడి మాస్ పెర్ఫామెన్స్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ కి గుర్తింపు దక్కింది.
అల్లు అర్జున్ కెరీర్ ఉత్తమ చిత్రంగా పుష్ప రికార్డులు సృష్టించింది. ఇప్పుడు అంతకుమించి అనేలా అతి భారీ చిత్రంగా పుష్ప 2 తెరకెక్కుతోంది. ప్రస్తుతం సీక్వెల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కి ఇంతలోనే అదిరిపోయే శుభవార్త అందింది. పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ నటనకు ఫిదా అయిపోయిన జాతీయ అవార్డుల జూరీ అతడిని జాతీయ ఉత్తమ నటుడుగా ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బన్ని సైలెంట్ గా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ నేషనల్ ఫిల్మ్స్ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటించగానే.. నిజానికి అల్లు అర్జున్ ఇది ఊహించారో లేదో కానీ ప్రతిభకు తగ్గ గౌరవం అందుకుంటున్నాడంటూ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టిన పుష్పకు ఈ పురస్కారం దక్కడం ఎంతో సముచితం అని కూడా ముచ్చటించుకుంటున్నారు. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొట్ట మొదటి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించాడు.
అయితే జాతీయ అవార్డులను నేటి సాయంత్రం ప్రకటిస్తున్నారు అనగానే అందరి దృష్టి ఆర్.ఆర్.ఆర్ పైకి, అందులో నటించిన స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ పైకి మళ్లింది. ఆర్.ఆర్.ఆర్ పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంటుందని చాలా సులువుగానే గెస్ చేసారు. అయితే ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కి ఉత్తమ నటుడుగా పురస్కారం దక్కేందుకు ఛాన్సుందని కూడా అంతా భావించారు. ముఖ్యంగా మెగాభిమానులు రామ్ చరణ్ కి .. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ కి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కాలని ఆకాంక్షించారు.
కానీ ఆ ఆకాంక్షలకు గండి కొడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఎగరేసుకుపోయారు. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ గా అతడి మాస్ పెర్ఫామెన్స్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ కి గుర్తింపు దక్కింది. అందుకే ఉత్తమ నటుడుగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పురస్కారం ఖరారైంది. జూరీ తీసుకున్న నిర్ణయం సముచితమైనది అంటూ ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన ఆహార్యం నభూతోనభవిష్యతి. ప్రపంచవ్యాప్తంగా అతడి నటనకు ప్రజలు నీరాజనాలు పలికారు.
ముఖ్యంగా ఆ పాత్రను దర్శకుడు సుకుమార్ అంత గొప్పగా మలిచారు. అది ఒరిజినాలిటీ ఉన్న ఒక రా అండ్ రస్టిక్ పాత్ర. అడవిలో గంధపు చెక్కల్ని మాయం చేసే స్మగ్లర్ పుష్పరాజ్ గా బన్ని అద్భుతమైన నటనతో ఫిదా చేసారు. ఇక ఈ సినిమాలో అతడి డ్యాన్సులకు ఇమ్మిటేషన్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కేవలం సామాన్య యూట్యూబర్లు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు పుష్పరాజ్ స్టెప్పుల్ని అనుకరిస్తూ ఎంతో ఎంజాయ్ చేసారు.
టాలీవుడ్ హిస్టరీలో పుష్పరాజ్ కి దక్కినంతగా.. ఈ స్థాయిలో అభిమానం ప్రేమ ఆదరణ ఇంకే నటుడిగా దక్కలేదంటే అతిశయోక్తి కాదు. పుష్ప 1 తో సంచలనాలు సృష్టించిన బన్ని పుష్ప 2తో అంతకుమించి సంచలనాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటివరకూ ఇండియాలో ఉన్న చాలా రికార్డుల్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందని కూడా భావిస్తున్నారు. పుష్ప 2 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.