ఇప్పుడు బ్యాలెన్స్ అయ్యింది రాజా..!
ముఖ్యంగా మన పొరుగు పరిశ్రమ అయిన తమిళంలో ఇద్దరు ముగ్గురు హీరోలు జాతీయ అవార్డులతో ముందంజలో ఉన్నారు
తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటుతున్నా.. గ్లోబల్ వైజ్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నా మన స్టార్స్ కి నేషనల్ అవార్డు రాలేదు అన్న వెలితి నిన్నటిదాకా ఉంది. ముఖ్యంగా మన పొరుగు పరిశ్రమ అయిన తమిళంలో ఇద్దరు ముగ్గురు హీరోలు జాతీయ అవార్డులతో ముందంజలో ఉన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క హీరో కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకోలేదే అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే పుష్ప రాజ్ ఆ కోరిక నెరవేర్చేశాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని కైవసం చేసుకున్నాడు అల్లు అర్జున్. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అతను చూపించిన అభినయం కమర్షియల్ హిట్ అవడమే కాదు అల్లు అర్జున్ నట విశ్వరూపం ఏంటో కూడా అందరికీ తెలిసేలా చేసింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్య సినిమా నుంచే నటుడిగా తన అసలు జర్నీ మొదలు పెట్టిన అల్లు అర్జున్ అతనితో చేసిన ప్రతి సినిమాతో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటూనే ఉన్నాడు.
ఇక పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇన్నాళ్లు మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ లు కొడుతున్నా బెస్ట్ యాక్టర్ అవార్డు లేదే అన్న భావన ఉండేది కానీ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ అది సాధించి తెలుగు సినిమా పరిశ్రమని గర్వపడేలా చేశాడు. 69 వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా పరిశ్రమ డామినేషన్ తెలిసిందే. పుష్ప హీరోగా అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డులు అందుకున్నారు.
RRR సినిమాకు అవార్డుల పంట పండింది. నేషనల్ అవార్డుల్లో ట్రిపుల్ ఆర్ కి ఏకంగా 6 అవార్డులు వచ్చాయి. పుష్ప సినిమాకు రెండు అవార్డులే వచ్చినా అవి రెండు ప్రధానమైనవి కావడం చేత ప్రస్తుతం పుష్ప రాజ్ అల్లు అర్జున్ ట్రెండింగ్ లో ఉన్నాడు. పుష్ప పాత్రలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని మాత్రమే కాదు నేషనల్ లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ కి బీ టౌన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఏదో సరదాగా రిలీజ్ చేసిన పుష్ప హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేసే కలెక్షన్స్ రాబట్టింది.